శ్రీపెరంబుదూర్‌లో వైభవంగా శ్రీనివాసకల్యాణం

భగవద్‌ రామానుజుల 7వ విడత సంచారరథయాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం, శ్రీపెరంబుదూర్‌లో బుధవారం సాయంత్రం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు.

శ్రీపెరంబుదూర్‌లోని వివేకానంద మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ మైదానంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం ప్రారంభమైంది. ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన శ్రీపెరంబుదూర్‌ భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

రామానుజ సంచారరథయాత్రలో భాగంగా బుధవారం శ్రీ పెరంబుదూర్‌లోని శ్రీ ఆదికేశవ పెరుమాళ్‌ ఆలయం (దివ్యదేశం), తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవ పెరుమాళ్‌ ఆలయాలను(దివ్యదేశం) దర్శించుకున్నారు.

ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 6.30 గంటలకు శ్రీపెరంబుదూర్‌ నుండి బయలుదేరి మధురాంతకంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి రథయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 6.00 గంటలకు మధురాంతకంలో శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.