శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక సంగీత, ధార్మిక కార్యక్రమాల సందడి

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక సంగీత, ధార్మిక కార్యక్రమాల సందడి

నాదనీరాజనం, ఆస్థాన మండపంలో భక్తిరసామృతం

తిరుమల, 2026 అక్టోబరు 18: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నాదనీరాజనం వేదికపై..

ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ కె.వి. కేశన్న, శ్రీ జి. చంద్రశేఖర్ బృందం మంగళధ్వని వినిపించింది. ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద సందేశం అందించారు.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి ఆనందలక్ష్మి బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు పద్మశ్రీ ఎ. కన్యాకుమారి బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తన లహరి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.

ఆస్థాన మండపంలో..

ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎన్. మాధవి బృందం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించింది. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి మంజుల బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించింది. అనంతరం డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని అన్నమయ్య సందేశంపై ధార్మికోపన్యాసం చేశారు.

సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు డాక్టర్ ఆర్.ఎన్.ఎస్. శైలేశ్వర బృందం అన్నమయ్య సంకీర్తనలను మధురంగా ఆలపించింది. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీమతి ఎం. పూర్ణ బృందం హరికథా గానం భక్తులను అలరించింది.

వేద మంత్రోచ్చారణలు, అన్నమయ్య సంకీర్తనలు, భక్తి సంగీతం, నృత్య ప్రదర్శనలు, హరికథతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలను వీక్షించి స్వామివారి భక్తిలో పరవశించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.