శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సాక్షాత్కార వైభవంపై జెఈఓ సమీక్ష

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సాక్షాత్కార వైభవంపై జెఈఓ సమీక్ష

తిరుపతి, జూలై 04, 2013: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం ఉత్సవం నిర్వహణపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలోని శ్వేత భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ జూలై 12 నుండి 14వ తేదీ వరకు సాక్షాత్కార వైభవం ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవంలో ఎక్కువ సంఖ్యలో భక్తులను భాగస్వాములను చేసేందుకు తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ప్రచార రథాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిలోని ప్రముఖ కూడళ్లు, చంద్రగిరి, శ్రీనివాసమంగాపురం, భాకరాపేట ప్రాంతాల్లో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలోని ముఖ్యమైన కూడళ్లలో ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణ చేయాలని ఆదేశించారు. తితిదే ఉద్యోగుల కోసం క్వార్టర్స్‌ నుండి, యాత్రికుల కోసం విష్ణునివాసం, శ్రీనివాసం వసతి సముదాయాల నుండి, భక్తుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. పుస్తక విక్రయశాల ఏర్పాటుచేయాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు.

ఈ సందర్భంగా జూలై 9వ తేదీన స్వర్ణ పుష్పార్చన సేవ, జూలై 12 నుండి 14వ తేదీ వరకు ఆర్జిత కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు కానున్నట్టు తెలిపారు. అదేవిధంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జెఈవో వివరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.