సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

తిరుపతి, మే  23, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.
అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీవారు కల్యాణకట్ట మండపానికి స్వామివారు వేంచేస్తారు. అక్కడ తేరుచూపు చూసి తిరిగి వాహనమండపానికి వేంచేస్తారు. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను ఆహ్లాదపరుస్తాడు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర పిళ్లై, విజిఓ శ్రీ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం మహతి కళాక్షేత్రంలో శ్రీ దామోదర నాయుడు ధార్మికోపన్యాసం, అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సింహాచలశాస్త్రి హరికథ, శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద శ్రీ ధూళిపాల శివరామకృష్ణ శర్మ హరికథ, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద శ్రీ చెంచుసుబ్బయ్య ధార్మికోపన్యాసం కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
   —————————–——————————————-
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.