హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

తిరుపతి, మే  22, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది.  బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. అందువల్ల రాముని ప్రతిరూపమైన వేంకటేశ్వరుని హనుమంతుడు మోయడం ఉపపన్నమే. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారు. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
హైందవ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జంతువుకు ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం లక్ష్మీపతికి కూడా వాహనంగా విశిష్టసేవలు అందిస్తోంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర పిళ్లై, విజిఓ శ్రీ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం మహతి కళాక్షేత్రంలో శ్రీ హెచ్‌.ఎస్‌.బ్రహ్మానంద ధార్మికోపన్యాసం, అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామభట్టార్‌ హరికథ, శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద శ్రీ ఎం.బి.జయకుమార్‌రెడ్డి హరికథ కాలక్షేపం, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద శ్రీమతి ఎన్‌.సి.శ్రీదేవి సంగీత సభ ఏర్పాటుచేశారు.
   —————————–——————————————-
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.