6వ బ్యాచ్‌ అర్చక శిక్షణా శిబిరం

6వ బ్యాచ్‌ అర్చక శిక్షణా శిబిరం

తిరుపతి, మార్చి-07, 2011:  సమాజంలో విశిష్ఠమైన స్థానమున్న అర్చక స్వాములు ప్రజల్లో నైతిక విలువలను, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి కృషి చేయాలని తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.భాస్కర్‌ తెలిపారు. సోమవారం స్థానిక శ్వేతనందు జరిగిన 6వ బ్యాచ్‌ అర్చక శిక్షణా శిబిరం ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలలో పూజాది కార్యక్రమాల నుంచి ఆయా గ్రామాలలో మంచి చెడులను నిర్దేశించి చెప్పడంలో అర్చకుల పాత్ర కీలకంగా వుందని ఆయన తెలిపారు. టిటిడి కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని సమాజంలో అందరికీ ఆదర్శ ప్రాయులుగా మెలగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అర్చకులు కులమత ప్రాంతీయబేధాలు లేకుండా సమాజాన్ని ఐక్యతతో ముందుకు నడిపించాలని ఆయన కోరారు. జీవాత్మకు, పరమాత్మకు అనుసంధానంగా అర్చకులు నిలబడివున్నారని ఆయన పేర్కొన్నారు.
             

ఈకార్యక్రమంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశంజిల్లాల నుండి వచ్చిన దాదాపు 52 మంది దళిత పూజారులు, శ్వేత డైరెక్టర్‌ డాక్టర్‌ రామక్రిష్ణ, అర్చక శిక్షణ కో-అర్డినేటర్‌ శ్రీ సదాశివం తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదిన ఉదయం 10 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు మహిళాదినోత్సవం వేడుకగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.