7th FOUNDATION DAY OF S.V.VEDIC UNIVERSITY _ ఘనంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం
ఘనంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం
తిరుపతి, జూలై 12, 2013: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏడవ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చేపట్టిన ‘సుదర్శన లక్ష్మీనారాయణ’ మహాయాగంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంజి.గోపాల్ పాల్గొన్నారు.
అనంతరం వర్సిటీ పరిశోధన మరియు ప్రచురణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పుస్తక విక్రయశాలను ఈవో ప్రారంభించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయం నుండి ”వేద ప్రవృత్తి” పేరిట మూడు నెలలకోసారి వెలువడే న్యూస్‌లెటర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఇందులో వర్సిటీలో జరిగిన పరిశోధనలు, ఇతర విజ్ఞాన కార్యక్రమాల వివరాలను పొందుపరిచారు.
ఆ తరువాత జరిగిన వ్యవస్థాపక దినోత్సవ సభా కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి శ్రీ శ్రీరామమూర్తి, వేద వర్సిటీలోని అన్ని విభాగాల అధిపతులు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.విజయకుమార్, డీన్ శ్రీ తారకరామకుమార్ శర్మ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.