ఏప్రిల్‌ 9న శ్రీవారిమెట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

ఏప్రిల్‌ 9న శ్రీవారిమెట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

తిరుపతి, ఏప్రిల్‌,07, 2011: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు వెళ్ళే సోపాన మార్గాలలో ఒకటైన శ్రీవారిమెట్టు మార్గంలో వెలసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం యొక్క ద్వితీయ వార్షికోత్సవం ఈ నెల 9వ తారీఖున జరుగనుంది.

ఈ సందర్భాన్ని పురష్కరించుకొని తితిదే ఏప్రిల్‌ 9 అనగా శనివారం నాడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే వైఖానస ఆగమ సలహాదారు డాక్టర్‌ వేదాంతం విష్ణుభట్టాచార్యులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 8.30 గంటలకు శాంతిహోమం, పూర్ణాహుతితో ప్రారంభమై, ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అష్టోత్తరశతకలశాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12.00 గంటలకు అలంకారం, నైవేద్యాల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు వేదపారాయణం, మంగళవాయిద్యం, ఇత్యాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఐతిహ్యం ప్రకారం ఈ సోపాన మార్గాన్ని విజయనగరాధీశుడైన శ్రీకృష్ణదేవరాయులు సుమారు 500 ఏండ్లకు పూర్వం ఎంతగానో అభివృద్ధిచేసి ఈ మార్గం గుండా తిరుమలను చేరుకొని స్వామివారిని దర్శించుకొనేవాడు. అంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈమార్గాన్ని అభివృద్ధి చేయడానికి తితిదే రెండేళ్ళపూర్వం ఇక్కడ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి ఆలయాన్ని కూడా నిర్మించింది. ఈ ఆలయానికి సంబంధించిన ద్వితీయ వార్షికోత్సవం ఈ శనివారం జరుగనుంది.

సుమారు 2.1 కి.మీ. పొడవు గల ఈ మార్గంలో 2000 లకు పైచిలుకు మెట్లు వున్నాయి. సాధారణంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు చెందిన భక్త జనం, కర్ణాటక నుండి వచ్చే భక్తులు ఈ మార్గాన్నే ఎంచుకొంటారు. ఇటీవల కాలంలో ఈ మార్గం అత్యంత ప్రాచుర్యాన్ని పొంది ఈ సోపాన మార్గం గుండా విచ్చేసే భక్తుల సంఖ్యకకూడా గణనీయంగా పెరిగింది. ఇక్కడ వెలసియున్న శ్రీవారిమెట్టు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని భక్తులు మెట్లను అధిరోహించి తిరుమలకు చేరుకొంటున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.