CHATRA STHAPANA HELD AHEAD OF RATHOTSAVAM _ వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
Tirumala, September 21, 2026: The traditional Chatra Sthapana, or Golden Umbrella Ceremony, was held at the Main Kalyana Katta in Tirumala on Monday evening as part of the Tirumala Srivari Salakatla Brahmotsavams, ahead of the Rathotsavam scheduled for September 22.
The age-old tradition is performed on the eve of the Rathotsavam under the supervision of the Kalyana Katta staff.
According to historical records, it has been continued for centuries by the descendants of Pantulugari in accordance with a Dharmashasanam issued by Chandragiri ruler Sri Srinivasa Mahadeva Rayalu during the time of Sri Krishnadevaraya.
The offering of a golden umbrella has been continuing since 1952.
The ceremony was led by Pantulugari descendant Sri Pantulugari Ramanathan.
TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, State Nai Brahmin Corporation Chairman Sri Rudrakoti Sadashivam, Kalyana Katta Deputy EO Sri Ramakanth, Superintendents Sri Janakiram and Sri Sudhakar Reddy, and other officials and staff participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
రథోత్సవానికి ముందు ఆనవాయితీగా ఛత్రస్థాపన
తిరుమల, 2026 సెప్టెంబరు 21: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, సెప్టెంబరు 22న జరగనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం సోమవారం సాయంత్రం తిరుమలలోని ప్రధాన కల్యాణకట్ట వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు రథోత్సవానికి ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శతాబ్దాల చారిత్రక సంప్రదాయం
చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రగిరి రాజు శ్రీనివాస మహదేవ రాయలు చేసిన ధర్మశాసనం మేరకు పంతులుగారి వంశస్తులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.
తొలినాళ్లలో కొయ్య గొడుగుతో ప్రారంభమైన ఈ సంప్రదాయంలో, 1952 సంవత్సరం నుంచి రథానికి బంగారు గొడుగును సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
భక్తిశ్రద్ధలతో ఛత్రస్థాపన
తిరుమల కల్యాణకట్టలో పంతులుగారి ప్రస్తుత వంశీకుడు శ్రీ పంతులుగారి రామనాథన్ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రుద్రకోటి సదాశివం, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో శ్రీ రమాకాంత్, సూపరింటెండెంట్లు శ్రీ జానకిరామన్, శ్రీ సుధాకర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.



