NAVARATRI BRAHMOTSAVAMS TO BE CONDUCTED SUCCESSFULLY AKIN TO SALAKATLA BRAHMOTSAVAMS – TTD ADDITIONAL EO _ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతం చేయాలి: టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
Tirumala, 28 September 2026: The TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary directed all departments to work in close coordination and conduct the Navaratri Brahmotsavams with more enthusiasm, akin to the recently concluded Salakatla Brahmotsavams.
Reviewing the arrangements at Tirumala on Monday evening along with JEO Sri Prabhala Gopinath and CVSO Sri Muralikrishna, he said that, owing to Adhika Masam, the Navaratri Brahmotsavams commences in a little over two weeks gap.
Based on the feedback received during the Salakatla Brahmotsavams, corrective measures have been initiated in various departments.
As the Navaratri Brahmotsavams coincide with holidays, an additional 20 per cent pilgrim turnout is being anticipated.
Accordingly, advance arrangements are being made for Annaprasadam, procurement, stocking, transportation and logistics.
He said priority would continue to be accorded to common devotees.
During the Salakatla Brahmotsavams, an average of around 73,000 devotees had Moolavirat darshan every day, while the waiting time was largely restricted to 5–8 hours and a maximum of 10 hours through effective planning.
Necessary restrictions on VIP, privilege and other categories of darshan would be imposed whenever required to reduce the waiting time for common devotees.
The Security arrangements, Vahana Sevas, SVBC live telecasts, cultural programmes and Nada Neerajanam would also be coordinated effectively.
In view of the possibility of rains during October, precautionary and alternative arrangements are being planned in coordination with the district administration and police authorities.
The NDRF services would also be utilised wherever necessary.
The Additional EO appealed to devotees to follow only the official information issued through TTD’s authorised platforms and plan their travel and darshan accordingly.
He directed all departments to work as one team, giving priority to devotee convenience, safety and the maintenance of a spiritual atmosphere for the successful conduct of the upcoming Navaratri Brahmotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతం చేయాలి
బ్రహ్మోత్సవాలలో టీటీడీ ఏర్పాట్లపై 95% పైగా సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
తిరుమల, 2026 సెప్టెంబర్ 28: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయిన నేపథ్యంలో కేవలం 17 రోజుల వ్యవధిలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వివిధ విభాగాల పనితీరుపై సేకరించిన ఫీడ్‌బ్యాక్, చెక్‌లిస్ట్‌లను విభాగాల వారీగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దడంతోపాటు మరింత మెరుగైన సమన్వయం కోసం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో అన్నప్రసాదం, విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణతోపాటు పలు విభాగాల్లో 95 నుంచి 98 శాతం వరకు సంతృప్తి వ్యక్తమైనట్లు తెలిపారు. ఇదే అనుభవంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పూర్తిస్థాయిలో సెలవులు ఉండటం వల్ల గత బ్రహ్మోత్సవాలతో పోలిస్తే మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల భక్తుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని అదనంగా సుమారు 20 శాతం భక్తుల రాకను అంచనా వేస్తూ అన్నప్రసాదం, అవసరమైన సామగ్రి, ప్రొక్యూర్‌మెంట్, స్టాకింగ్, రవాణా, లాజిస్టిక్స్ తదితర అంశాల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శన సమయాలను తగ్గించేందుకు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని అదనపు ఈవో తెలిపారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులలో రోజుకు సగటున సుమారు 73 వేల మంది భక్తులు మూలమూర్తి దర్శనం చేసుకున్నారని, అయినప్పటికీ సరైన ప్రణాళికతో దర్శనానికి వేచి ఉండే సమయాన్ని చాలా వరకు తగ్గించగలిగామని చెప్పారు. సాధారణంగా 5 నుంచి 8 గంటలు, గరిష్టంగా 10 గంటలలోపు దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
సామాన్య భక్తుల సర్వదర్శనానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు వీఐపీ, ప్రివిలేజ్ దర్శనాలు, సీనియర్ సిటిజన్లు, చిన్న పిల్లలు, శ్రీవాణి, ఎస్‌ఈడీ తదితర దర్శనాల విషయంలో అవసరమైన నియంత్రణలు చేపట్టినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి కొన్ని దర్శనాలను తగ్గించడం లేదా రద్దు చేయడం ద్వారా సర్వదర్శన భక్తులకు వేచి ఉండే సమయాన్ని తగ్గించే విధానాన్ని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించనున్నట్లు చెప్పారు.
మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలను కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించే అవకాశం కల్పించేందుకు రెండింటినీ సమన్వయం చేస్తూ మ్యాన్‌పవర్, ఇతర వనరులను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
భద్రత, వర్షాలపై ప్రత్యేక దృష్టి
జిల్లా పోలీసు యంత్రాంగంతో మరోసారి సమన్వయ సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ద్వారా ఊరేగింపులు, వాహనసేవల నిర్వహణను మరింత క్రమబద్ధీకరించి, నిర్ణీత టైమ్‌లైన్ ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. అక్టోబర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా సమగ్ర ప్రణాళికలో చేర్చినట్లు తెలిపారు.
ఎస్‌వీబీసీ ప్రసారాలు, సాంస్కృతిక కార్యక్రమాలపై సమీక్ష
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలతోపాటు ఎస్‌వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాదనీరాజనం కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులతో అంశాల వారీగా చర్చించినట్లు తెలిపారు.
ప్రతి విభాగం తమ అవసరాలు, సమస్యలు, గత బ్రహ్మోత్సవాల అనుభవాలు, తదుపరి ఉత్సవాల్లో చేయాల్సిన మెరుగుదలలను సమావేశంలో వివరించిందని, వాటిపై చర్చించి సమన్వయంతో పనిచేసేలా ఏకాభిప్రాయం సాధించినట్లు చెప్పారు.
భక్తులు టీటీడీ సమాచారాన్ని అనుసరించాలి
తిరుమలలో భక్తుల సంఖ్య, వాహనాల రాక, పార్కింగ్, అన్నప్రసాదం, భద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తుందని అదనపు ఈవో తెలిపారు.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తదితర అధికారిక వేదికల ద్వారా అందించే సమాచారాన్ని భక్తులు తప్పనిసరిగా అనుసరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారానికి అనుగుణంగా భక్తులు తమ ప్రయాణాన్ని, దర్శన ప్రణాళికను రూపొందించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
భక్తుల సౌకర్యం, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని విభాగాలు టీమ్‌వర్క్‌తో పనిచేసి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.






