ADIBHATLA’S 149TH BIRTH ANNIVERSARY CELEBRATED BY TTD _ సర్వకళల సమ్మేళనం హరికథ : తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
సర్వకళల సమ్మేళనం హరికథ : తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
తిరుపతి, సెప్టెంబరు 01, 2013: ఆంధ్రుల సంస్కృతిలో ప్రాచీన కళగా గుర్తింపు పొందిన హరికథ సంగీతం, సాహిత్యం, నాట్యం, అభినయం లాంటి సర్వకళల సమ్మేళనమని తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు. హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 149వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఏడు రోజుల పాటు తలపెట్టిన హరికథా సప్తాహ మహోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.
ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తిరుమల జెఈవో ప్రసంగిస్తూ నారాయణదాసవర్యులు భగవత్ ప్రచారం కోసం హరికథ అనే కళారూపాన్ని సృష్టించినట్టు తెలిపారు. అలాంటి మహనీయుని జయంతి సందర్భంగా పండితుల ఉపన్యాసాల ద్వారా హరికథ గొప్పదనాన్ని తెలుసుకోవడం, సీనియర్ కళాకారులను సన్మానించుకోవడం, ప్రముఖ భాగవతార్‌ల హరికథాగానాన్ని వినడం ముదావహమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా హరికథ లాంటి ప్రాచీన కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు హరికథలపై ఆసక్తి పెంచుకుని మన సంస్కృతి గొప్పదనాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారు. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో తిరుపతి పుర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జెఈవో కోరారు. అంతకుముందు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన జెఈవో అనంతరం శ్రీ ఆదిభట్ట నారాయణదాస చిత్రపటాన్ని, శ్రీ దీక్షిత దాసు రచించిన ”ద్రౌపది మానసంరక్షణము” అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.
సభకు అధ్యక్షత వహించిన తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి ఆచార్య హెచ్.ఎస్.బ్రహ్మానంద మాట్లాడుతూ నారాయణదాసవర్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. ఈయన సాహిత్యంపై విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయన ఆకాంక్షించారు. హరికథలు ఒకప్పుడు ప్రజాపాఠశాలలుగా వర్ధిల్లాయని, ఎక్కువమంది ప్రజలు ఆధ్యాత్మిక, పౌరాణిక విషయాలను వీటి ద్వారా తెలుసుకునేవారని వివరించారు. కథలోని భావాన్ని ఖచ్చితంగా తెలియజేయాలంటే హరిదాసులకు ఆధ్యాత్మిక ప్రబోధ జ్ఞానం తప్పనిసరి అన్నారు. ఎక్కువ మంది ప్రేక్షకులను మెప్పించాలంటే హరికథ కళాకారులకు ఎంతో ఆత్మస్థైర్యం ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తితిదే ముఖ్య అంకణీయ అధికారి శ్రీ కె.ఎస్.ఎ.శేషశైలేంద్ర ప్రసంగిస్తూ హైదరాబాదు, ఢిల్లీ లాంటి నగరాల్లో మన సంస్కృతికి, సారస్వతానికి దూరంగా ఆధునిక పోకడలతో ఉన్న యువతకు హరికథ గొప్పదనాన్ని తెలియజేయాలని కోరారు. హరికథ ఉద్యమానికి ఈ వేదిక నుండే నాంది పలికి విస్తృతంగా ప్రచారం చేయాలని, అప్పుడే నారాయణదాసవర్యులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఆయన వెల్లడించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారి శ్రీ తలారి రవి ప్రసంగిస్తూ సమాజంలో నైతిక విలువల వ్యాప్తికి హరికథలు దోహదపడతాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన తితిదే తిరుపతిలోని పలు వేదికలపై ప్రతిరోజూ హరికథా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హరికథకు పూర్వ వైభవం తెచ్చేందుకు కళాకారులు కృషి చేయాలని, ఇందుకు తితిదే పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. అనంతరం తితిదే సేవల విభాగం డెప్యూటీ ఈవో శ్రీ శివారెడ్డి, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ ప్రసంగించారు. అంతకుముందు అతిథులను శాలువ, శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటంతో జెఈవో సన్మానించారు.
ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన డాక్టర్ పి.ఇందిరాహేమ ”శ్రీదారుగారు – నృత్య సంవిధానం, వైశిష్ట్యం” అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. ఇందులో నారాయణదాసవర్యులకు మంచి వాక్కుతో పాటు సంగీత, సాహిత్య జ్ఞానం, నృత్యం, అభినయంలో మంచి పట్టు ఉండేదని ఆమె తెలిపారు. హరికథ చెప్పేటప్పుడు యజ్ఞం చేస్తున్న భావనతో విషయంలో లీనమై ప్రేక్షకులకు మరో లోకంలోకి తీసుకెళ్లాలని సూచించారు. వివిధ రకాల హస్త, పాదముద్రలను ఏయే సందర్భాల్లో ప్రదర్శించాలో వివరించారు. కళాకారుడు పాత్రోచితంగా నవరసాలను పలికించాలని ఆమె తెలిపారు.
హైదరాబాదుకు చెందిన శ్రీమతి పి.శ్యామసుందరి ”బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆదిభట్ట” అనే అంశంపై ఉపన్యసిస్తూ నారాయణదాసవర్యులు విశ్వమానవ శ్రేయస్సు కోసం హరికథలు రచించి గానం చేసినట్టు తెలిపారు. ఈయనకు ఏడెనిమిది భాషలపై పట్టు ఉందని, ఆయా భాషల్లోని సాహిత్యాన్ని బాగా ఒంటబట్టించుకున్నారని వెల్లడించారు. జీవహింసను, ఆనాటి సాంఘిక దురాచారాలను ఈయన గట్టిగా వ్యతిరేకించారని ఆమె పేర్కొన్నారు.
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చల్లా ప్రభావతి దీక్షితులు, హరికథా విభాగాధిపతి శ్రీ వేంకటసింహాచల శాస్త్రి, అధ్యాపకులు శ్రీ వై.వేంకటేశ్వర్లు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాగా సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి విజయనగరం మహారాజ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మానాప్రగడ శేషసాయి అధ్యక్షత వహించారు. ఇందులో విశాఖపట్నంకు చెందిన శ్రీ రామకృష్ణానంద నారాయణదాస సాహితీ వైభవంపై ఉపన్యసించనున్నారు. అనంతరం కర్నూలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ములుకుట్ల బ్రహ్మానంథాస్త్రి ”మహాకవిశేఖర – శ్రీ ఆదిభట్ట” అనే అంశంపై ఉపన్యసిస్తారు. ఈ సందర్భంగా సీనియర్ హరికథ కళాకారులు లక్ష్మీనరసింహాపురానికి చెందిన శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ విద్వత్ సన్మానం అందుకోనున్నారు. ఆ తరువాత రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి మండూరి లక్ష్మీకుమారి ”శ్రీరామజననం” హరికథాగానం చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.