AKHANDA SUNDARAKANDA CONCLUDES _ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం
– భక్తుల నుండి టీటీడీకి అభినందనలు
తిరుమల, 2024 జూన్ 02: తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఆదివారం ఉదయం 6 గంటలకు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు.
హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ టీటీడీ సంపూర్ణ అఖండ సుందరకాండ పారాయణాన్ని చేపట్టింది.
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ శ్రీ కె ఎస్ ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన అఖండ పారాయణ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది. భక్తుల రామనామ స్మరణతో వేద విజ్ఞాన పీఠం పరిసరాలు మారుమోగాయి.
సుందరకాండలోని 2,823 శ్లోకాలను 16 గంటల్లో పఠించడం ద్వారా మనం అన్ని సమస్యల నుండి, పాపాల నుండి విముక్తి పొందుతాము” అని వాల్మీకి మహర్షి తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య దాదాపు 16 గంటల పాటు నిర్విరామంగా అఖండ పారాయణ యజ్ఞం పూర్తయింది. నాలుగు బృందాల్లో వేద పండితులు ఈ శ్లోకాలను ఒక బృందం తరువాత మరొక బృందంగా పటించనున్నారు. ఇందులో భాగంగా బాలకాండ నుండి 100 శ్లోకాలు, యుద్ధకాండ నుండి 123 శ్లోకాలు సుందరకాండలోని 2,823 శ్లోకాలు కలిపి మొత్తం 3,046 శ్లోకాలు పారాయణం చేశారు.
ఒకవైపు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు, మరో వైపు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రాముడు, మరో వైపు రుక్మిణీ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులు ఉండగా ధర్మగిరిలోని ప్రార్థనా మందిరాన్ని వివిధ దేవతామూర్తులతో అలంకరించారు. వివిధ చోట్ల ఆంజనేయుడి దివ్యరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దేశం నలుమూలలతోపాటు విదేశాల నుండి సైతం భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్లోక పారాయణంలో పాల్గొన్నారు. ఈ పారాయణ కార్యక్రమాని నిర్వహిస్తున్న టీటీడీకి భక్తులు అభినందనలు తెలియజేశారు.
వేదపండితులు, భక్తులు చేసిన అఖండ సుందరకాండ పారాయణంతో ధర్మగిరి ప్రాంగణం మారుమోగింది.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ విసి శ్రీ రాణిసదాశివమూర్తి, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.