ANANTALWAR VARSHA TIRUNAKSHATRAM ON MARCH 11_ మార్చి 11న తిరుమలలో అనంతాళ్వారు 964వ అవతారోత్సవం

Tirumala, 6 March 2018: The 964th Avatharotsavam of Sri Ananthazhwan will be observed in Tirumala on March 11.
Ananthazhwan was a great disciple who pioneered pushpa kainkaryam of Lord Venkateswara at Tirumala with devotion. He was fondly called by Sri Ramanujacharyulu as ” Aan Pillai” , so he was known as Sri Ananthaan Pillai.

As a tribute on the 964th Avatarotsavam of Sri Anantazhwar, Purusaivari Thototsavam will be observed in Tirumala in a great manner.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 11న తిరుమలలో అనంతాళ్వారు 964వ అవతారోత్సవం

తిరుమల, 06 మార్చి 2018: శ్రీ వైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 964వ అవతారోత్సవం మార్చి 11న ఆయన వంశీకులు తిరుమలలోని పురుశైవారి తోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.

సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా ఆయన వంశీకులు తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా పరిగణించడం ఆనవాయితీ. ఆనాడు దేశ వ్యాప్తంగా స్థిరపడివున్న అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచానాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చారిత్రక నేపథ్యంలో శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపుగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీరామానుజాచార్యులతో కూడి అవిర్భవించినట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కూడి స్వామివారి ఆలయం చెంత ఒక పూతోటను నిర్మిస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యాన వన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడైనాడు.

నేటికి శ్రీవారి ఆలయంలో స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్య గాథను స్పురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొననున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.