NEW ACCOUNTS FOR TTD TO COMMENCE FROM JULY 17 WITH ANIVARA ASTHANAM FESTIVAL_ శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానానికి ఏర్పాట్లు పూర్తి
Tirumala, 15 July 2017: Among the umpteen number of festivals that are being observed in the hill shrine of Lord Venkateswara at Tirumala through out the year, Anivara Asthanam is an interesting as it is considered to be “Festival of commencement of New Accounts” in TTD.
This unique festival will be observed on July 16. A temple court will be conducted at Bangaru Vakili in connection with this festival on Sunday between 7am and 9am.
TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotavam, Vasanthotsavam and Sahasra Deeplankara Seva in connection with this festival on Sunday.
While in the evening Sri Malayappa swamy will be taken out in procession on an exquisite palanquin, tastefully decorated with colourful flowers between 6pm and 7pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానానికి ఏర్పాట్లు పూర్తి
తిరుమల, 15 జూలై 2017 : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన ఆదివారంనాడు జరుగనున్న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినానికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆదివారం ఉదయం 7 నుండి 9 గం||ల నడుమ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్, టిటిడి ఈవో, జెఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వస్తారు. శ్రీవారి మూలవిరాట్టుకు ఈ వస్త్రాలను సమర్పిస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు.
అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం” (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచుతారు.
చారిత్రక నేపథ్యం :
సాధారణంగా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు.
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమైయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు. అయినా శ్రీవారి ఆలయంలో ఈ వార్షిక సాలకట్ల ఉత్సవం నిరంతరాయంగా సౌరమానాన్ని అనుసరించి జరుగుతుండడం విశేషం.
ఆర్జితసేవలు రద్దు :
అణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జులై 16వ తేదీ ఆదివారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
పుష్ప పల్లకీపై ఊరేగింపు :
ఈ పర్వదినం సందర్భంగా సాయంత్రం 6 నుండి 7 గం||ల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు తిరుమల పురవీధుల గుండా అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.