ANIVARA ASTHANAM PERFORMED WITH RELIGIOUS FERVOUR _ శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం
శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం
తిరుమల, 16 జూలై 2013 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానమును తి.తి.దే అత్యంత వైభవంగా నిర్వహించింది.
ఈ వేడుకను పురస్కరించుకొని తి.తి.దే మంగళవారంనాడు అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.
తి.తి.దే ఆదాయ వ్యయాలు, నిలువలు, మున్నగు వార్షిక లెక్కలు ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అలయ అర్చకులు స్వామి, దేవేరులు మరియు సేనాధ్యకక్షుడు విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తుల సమక్షంలో కొలువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టునకు, ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.
ఆగమానుసారం తిరుమల పెద్ద జీయంగార్ పెద్ద వెండితట్టలో మడతపెట్టినటువంటి ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలమీద పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ తిరుమల చిన్న జీయంగార్, తి.తి.దే ఇ.ఓ, జె.ఇ.ఓ, ఇతర ఉన్నతాధికారులు మొదలైనవారితో కూడి స్వామివారి మూలవిరాట్టుకు ఈ వస్త్రాలను సమర్పించారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరించి మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. అటు తరువాత ‘లచ్చన’ తాళపు చెవి గుత్తిని తిరుమల పెద్ద జీయంగారికి, చిన్న జీయంగారికి వరుస క్రమంలో కుడిచేతికి తగిలించి హారతి, చందన, తాంబూల, తీర్థ, శఠారి మర్యాదలు చేసి అనంతరం రూపాయి హారతిని నివేదించారు. దీనితో ఆణివార ఆస్థానం ఘనంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, ఇ.ఓ. శ్రీ ఎం.జి గోపాల్, తిరుమల జె.ఇ.ఓ. శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, సి.వి.ఎస్.ఓ. శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్, పరకామణి డిప్యూటి.ఇ.ఓ శ్రీ కోదండరామారావు, ఆలయ పేష్కారు శ్రీ సెల్వం, పోటు పేష్కారు శ్రీ కేశవరాజు, ఏ.ఇ.ఓ శ్రీ శివారెడ్డి, పారుపత్తేదారు శ్రీ అజయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం భక్తులను ఉదయం 10.00 గం||ల నుండి స్వామివారి దర్శనానికి అనుమతించారు.
సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న వాహనమండపం నుండి సర్వాంగసుందరంగా వివిధ రకాల పుష్పాలతో తయారైన పుష్పపల్లకిని నేత్రపర్వంగా తిరుమాడ విధులలో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారుల పాల్గొంటారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.