ANKURARPANA HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 19 NOVEMBER 2022: The ritual of prelude, Ankurarpana or Beejavapanam was held in Tiruchanoor temple n Saturday evening.

The legends says, the sowing of seeds in mud pots under moonlight and the germination of these seeds to full bloom implies the hassle-free conduct of the Navahnika Karthika Brahmotsavams.

JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల ప్రత్యేకం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2022 నవంబరు 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపట్టారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రణామం సమర్పించి అనుజ్ఞ తీసుకున్నారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌వరణంలో వివరించారు.

అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్పణగావించారు. భూమాత ఉద్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేశారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహించారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేపట్టారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు,పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు , ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం, విజివో శ్రీ మనోహర్, ఎఇఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఎవిఎస్వో శ్రీ శైలేంద్రబాబు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.