ANNABHISHEKAM PERFORMED TO KAPILESWARA SWAMY WITH HEAPS OF RICE_ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా అన్నాభిషేకం

Tirupati, 3 November 2017:It’s been a visual treat to watch the “Annabhisheka Mahotsavam” performed to Sri Kapileswara Swamy in Tirupati on Friday in connection with the auspicious Karthika Pournami.

About 280 kilos of coocked rice has been used to offer celestial bath to the presiding deity amidst the chanting of Vedic mantras as per tenets of Saivagama.

This event took place between 12 noon to 2:30pm. The devotees were allowed for darshan between 4pm and 6pm. As this celestial event takes place once in a year, pilgrims thronged to witness the special Seva of Lord.

CHANDIYAGAM EARNS HUGE RESPONSE

Devotees took part in large numbers in the Chandi Yaga Mahotsavam that took place in Sri Kapileswara Swamy temple on Saturday. Meanwhile this Yagam will last till November 5.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా అన్నాభిషేకం

తిరుపతి, 2017, నవంబరు 03: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం అన్నాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా తెల్లవారుజామున 2.00 గంటలకు సుప్రభాతంలో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12.00 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.

అనంతరం సుమారు 280 కిలోల బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానపట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు.

సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు భక్తులకు అన్నాభిషేక సర్వదర్శనం కల్పించారు. సర్వదర్శనానంతరం సాయంత్రం 6.00 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అన్నాభిషేకంలో వినియోగించిన అన్నాన్ని సాంబారులో కలిపి భక్తులకు పంపిణీ చూశారు.

పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవంలో భక్తులు పాల్గొని అన్న లింగ దర్శనం చేసుకున్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మ సంచిత పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని, పశుపక్ష్యాది సకల జీవరాశులు సుభిక్షంగా ఉండడానికి ఈ అన్నాభిషేకం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌ రాజు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చండీయాగానికి విశేష స్పందన

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న చండీయాగానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబరు 28న ప్రారంభమైన శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) నవంబరు 5వ తేదీ వరకు జరుగనుంది.

కార్యక్రమంలో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌ రాజు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది