ANNAMACHARYA TAUGHT EQUALITY THROUGH HIS SANKEERTANS _ సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన అన్నమయ్య : డా|| ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌

TIRUPATI, 26 MAY 2024: The Saint Poet Sri Tallapaka Annamacharya preached equality and propagated all are equal before Almighty, said Annamacharya Project Director Dr Vibhishana Sharma.

Speaking during the 616th Annamacharya Jayanti celebrations held at Annamacharya Kalamandiram in Tirupati on Sunday he delivered his talk on Annamaiah Yoga Sankeertans.

Renowned scholars Sri Gouripeddi Venkata Shankara Bhagavan spoke on Annamaiah Sankeertans – Bhagavat Gita Prabhavam, while pfof. Sarvottama Rao on Annamaiah Srinivasuni Abhisheka Sankeertans.

Earlier, Smt Suseela team from Tirupati rendered Bhakti Sangeet.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన అన్నమయ్య : డా|| ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌

తిరుపతి, 2024 మే 26: అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించారని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా|| ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌ పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు ఆదివారం మూడ‌వ‌ రోజుకు చేరుకున్నాయి.

సదస్సుకు అధ్యక్షత వహించిన డా|| ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌ “అన్నమయ్య – యోగ‌ సంకీర్త‌న‌లు ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, ప్రసిద్ధ శ్రీవైష్ణవాచార్యులు భగవద్‌ రామానుజులు తెలియజేసిన అష్టాక్షరి మంత్రాన్ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా శ్రీ వైష్ణవ ధర్మాన్ని, భ‌క్తి తత్వాన్ని ప్ర‌చారం చేసినట్టు తెలిపారు. అన్న‌మ‌య్య యోగ సంకీర్త‌న‌ల ద్వారా ధ‌ర్మ‌, భ‌క్తి, శ‌ర‌ణాగ‌తి, అహింస ప్రధానంగా ఉన్నాయన్నారు. హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామసంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివ‌రించారు.

ఎస్వీ యూనివ‌ర్శిటి విశ్రాంత ఆచార్యలు డా. స‌ర్వోత్త‌మ‌రావు ”అన్నమయ్య – శ్రీ‌నివాసుని అభిషేక సంకీర్త‌న‌లు” అనే అంశంపై ఉపన్యసిస్తూ, తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే అభిషేకము శుక్రవారం నాడే ఎందుకు జరుపుతారో తెలియజేసినారు. ఆ సందర్భంలో జరిగే కైంకర్యాలు కూలంకషంగా వివరించారు.

తిరుప‌తికి చెందిన ప్ర‌సిద్ధ సాహితీవేత్త శ్రీ గౌరిపెద్ది  వేంక‌ట శంక‌ర భ‌గ‌వాన్‌ ”అన్నమయ్య సంకీర్తనలు – భ‌గ‌వ‌ద్గీతా ప్ర‌భావం” అనే అంశంపై మాట్లాడుతూ, భగవద్గీత బోధనలను అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనల ద్వారా సమర్పించారన్నారు. కర్మ,, జ్ఞాన, ధ్యాన మరియు తత్త్వ మార్గములు భగవంతుని చేరటానికి అంత సులభం కావు. అవేవీ ఉపాయాలు కావు, శరణాగతి కోరి భక్తి మార్గమొక్కటే శ్రీహరి పాదాల చెంతకు చేర్చి మోక్షప్రాప్తి పొందుటకు సాధ్యమని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలు చదివి అర్థం చేసుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలన్నీ అర్ధమైనట్లేనన్నారు. అన్నమయ్య వీటన్నింటిని అవపోసన పట్టి సరళమైన భాషలో సంకీర్తనల రూపంలో అందించారని వివరించారు.

అంత‌కుముందు ఉద‌యం 9 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి సుశీల‌ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అనంత‌రం సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన కుమారి ల‌లిత‌, శ్రీ హ‌య‌గ్రీవ నారాయ‌ణాచార్యులు బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 గంట‌లకు హైద‌రాబాద్‌కు చెందిన‌ శ్రీ శ్రీ‌నివాస శ‌ర్మ బృందం సంగీత స‌భ‌ నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కోకిల‌, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.