ANNAMAIAH KEERTANS LAID FOUNDATION FOR BHAKTI MOVEMENT_ దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమ నిర్మాత శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య : శ్రీ కె.వి.ఎస్‌.రాఘవన్‌

Tirupati, 1 May 2018: The impeccable sankeertanas penned by Sri Tallapaka Annamacharya laid foundation stone for Bhakti Movement in Telugu land, said renowned scholar Sri KVS Raghavan.

Speaking in the literary meet arranged at Annamacharya Kalamandiram on the occasion of 610th Birth Anniversary of the Saint Poete in Tirupati on Tuesday, he said the Sankeertans of Annamacharya portrayed the socio-economic-religious conditions prevailed in those days.

Other scholars also spoke on the occasion followed by cultural programmes.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమ నిర్మాత శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య : శ్రీ కె.వి.ఎస్‌.రాఘవన్‌

తిరుపతి, 2018 మే 1: దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమ నిర్మాత శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యులు అని, వాశిలోనూ రాశిలోనూ ఆయనకు మరొకరు సాటిరారని చిత్తూరుకు చెందిన ప్రముఖ పండితుడు శ్రీ కె.వి.ఎస్‌.రాఘవన్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాలు మంగళవారం మూడవ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ కె.వి.ఎస్‌.రాఘవన్‌ ” అన్నమయ్య సంకీర్తనల్లో నాయికా వైభవం” అనే అంశంపై ఉపన్యసించారు. భగవంతుడు, భక్తుడి మధ్య సంబంధాన్ని అన్నమయ్య తన సంకీర్తనల్లో వివరించారని తెలిపారు. పోతన కావ్యమార్గాన్ని అనుసరిస్తే, అన్నమయ్య సంకీర్తనల రచనను అవలంబించారని, వీరిద్దరూ సమకాలికులని, భాగవతోత్తములైన వీరు విష్ణుభక్తిని ప్రచారం చేశారని తెలియజేశారు.

తిరుపతికి చెందిన శ్రీ పొన్నా కృష్ణమూర్తి ”అన్నమయ్య సంకీర్తనల్లో సామాజిక స్ఫూర్తి తత్వచింతన” అనే అంశంపై మాట్లాడుతూ అన్నమయ్య తన సంకీర్తనలు సామాన్యుల నుండి పండితుల వరకు అర్థమయ్యేలా ఉన్నాయన్నారు. పట్టెడన్నం కోసం పడరానిపాట్లు ఎందుకు, ఇతరులకు మంచి చేయని జీవితం వ్యర్థమని, భక్తిమార్గాన్ని అందరికీ బోధించాలని విస్తృత ప్రచారం చేసిన మహానుభావుడు అన్నమయ్య అని అభివర్ణించారు. ఆత్మతృప్తితో అంతకు మించి ఆనందం ఏముందని తన కీర్తనల ద్వారా తెలియజేశారని వివరించారు.

చిత్తూరుకు చెందిన డా|| జి.ఉషారాణి ”అన్నమయ్య కీర్తనల్లో కల్యాణికీర్తనలు” అనే అంశంపై మాట్లాడుతూ ”నెల మూడు శోభనాలు నీకునతనికే తగును…, పిడికిలి తలంబ్రాల పెళ్లికూతురు…” అనే కీర్తనలు ఆలపించి వివరించారు. తిరుపతికి చెందిన డా|| సి.లలితారాణి ”అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వవైశిష్ట్యం” అనే అంశంపై మాట్లాడారు.

అనంతరం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే వాయిద్య సంగీతం, ప్రత్యేక కార్యక్రమాలు, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ కొండా రవికుమార్‌ బృందంచే నృత్యప్రదర్శన నిర్వహించనున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ వి.ఫణినారాయణ బృందంచే వీణ సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.