ANNAMAIAH TAUGHT BHAKTI PATH TO DEVOTEES _ సామాన్యుల‌కు భ‌క్తిమార్గాన్ని ప్ర‌బోధించిన అన్న‌మ‌య్య‌ : డా. వి.కృష్ణ‌వేణి

Tirupati, 10 Apr. 21: Saint poet Sri Tallapaka Annamacharya led the common devotees in the path of devotion with his simple worded sankeertans, said Dr V Krishnaveni, Head of Telugu department at Sri Padmavati Degree and PG College.

She was addressing the second-day session of Sahitya Sabha organised by TTD at Annamacharya Kala Mandir as part of 518th Vardhanti mahotsavam of Annamacharya.

Speaking on the theme of Annamaiah sankeertans and social developments, she said Annamaiah sankeertans were a window to Rayalaseema culture and personality development in the devotional path.

Other prominent speakers at the literary confluence were Dr S Ravindrababu of Chandragiri, Dr Gangishetty Lakshmi Narayana of Tirupati and Dr Sheikh Sha Vali of Chandragiri.

In the evening artists of the Annamacharya project, Dr P Ranganath and Smt K Vishalakshi presented melodious sankeertans and enthralled music lovers of temple city at Mahati 

The rhythm of Annamacharya sankeertans continued in the evening at Mahati with music concerts by project artist Smt R Bullemma.

The Annamacharya project Director Acharya S Dakshinamurthy Sharma, Superintendent Smt Nagamani, senior assistant Narasimhulu and music lovers participated.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI 

సామాన్యుల‌కు భ‌క్తిమార్గాన్ని ప్ర‌బోధించిన అన్న‌మ‌య్య‌ : డా. వి.కృష్ణ‌వేణి

తిరుపతి, 2021 ఏప్రిల్ 10: సామాన్య ప్రజలకు అర్థ‌మ‌య్యేలా జాన‌ప‌ద శైలిలో మాండ‌లికాల‌ను ఉప‌యోగించి సంకీర్త‌న‌లు ర‌చించి అన్నమయ్య భ‌క్తిమార్గాన్ని ప్ర‌బోధించార‌ని తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మ‌హిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ వి.కృష్ణవేణి తెలియజేశారు. శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జ‌రిగిన సాహితీ సదస్సులు శ‌నివారం ముగిశాయి.

ఈ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హించిన డా. వి.కృష్ణవేణి ‘అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు – సామాజిక జీవ‌నం’ అనే అంశంపై ఉప‌న్య‌సించారు. ఆనాటి సామాజిక ప‌రిస్థితుల్లో అన్ని వృత్తుల వారు స‌మాన‌మేన‌ని, రాజు – పేద తేడాలు ఉండ‌కూడ‌ద‌ని, అంద‌రికీ శ్రీ‌హ‌రే అంత‌రాత్మ అని అన్న‌మ‌య్య తెలియ‌జేశార‌ని వివ‌రించారు. ఆశ్ర‌మ‌ధ‌ర్మాల్లో గృహ‌స్తాశ్ర‌మ గొప్ప‌ద‌నాన్ని సంకీర్త‌న ద్వారా తెలియ‌జేశార‌న్నారు. పలు సంకీర్తనల్లో రాయలసీమ మండలికానికి పెద్దపీట వేశారని చెప్పారు. అన్నమయ్య కీర్తన‌లను చదివినా, విన్నా వ్యక్తిత్వ వికాసం క‌లుగుతుంద‌ని వివరించారు.

చంద్ర‌గిరికి చెందిన డా.ఎస్‌.ర‌విచంద్ర‌బాబు ‘అన్న‌మ‌య్య‌ సంకీర్త‌నల్లో భ‌క్తి – శ్రీ‌కృష్ణ‌జ‌యంతి ‘ అనే అంశంపై ఉప‌న్య‌సిస్తూ భ‌క్తి అంటే భ‌గ‌వంతునికి సేవ చేయ‌డ‌మ‌న్నారు. శ్రీ‌కృష్ణుని జ‌న్మ‌వృత్తాంతం, బాల‌కృష్ణుని లీల‌లు, కంసుని వ‌ధ‌, శ్రీ‌కృష్ణ‌జ‌యంతి త‌దిత‌ర ఘ‌ట్టాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా అన్న‌మ‌య్య ప‌లు సంకీర్త‌న‌లు ర‌చించార‌ని తెలిపారు. ఇందులో ప్ర‌ధానంగా దాస్య‌భ‌క్తి క‌నిపిస్తుంద‌ని, భ‌గ‌వంతుని చ‌ర‌ణాల‌ను ఆశ్ర‌యిస్తే చాలు స‌క‌ల‌శుభాలు క‌లుగుతాయ‌ని వివ‌రించారు.

తిరుప‌తికి చెందిన డా. గంగిశెట్టి ల‌క్ష్మీనారాయ‌ణ ‘అన్న‌మ‌య్య సంస్కృత సంకీర్త‌నా వైభ‌వం ‘ అనే అంశంపై మాట్లాడారు. అన్న‌మ‌య్య అలతి అల‌తి ప‌దాల‌తో దాదాపు 80 సంకీర్త‌న‌ల‌ను సంస్కృతంలో ర‌చించిన‌ట్టు తెలిపారు. సంస్కృత క‌వుల‌కు తెలుగు భాష రాక‌పోయినా ప‌ర‌వాలేద‌ని, తెలుగు క‌వుల‌కు మాత్రం త‌ప్ప‌కుండా సంస్కృతం తెలిసి ఉండాల‌న్నారు. అన్న‌మ‌య్య ప‌ద ప్ర‌యోగ నిపుణ‌త అనిత‌ర సాధ్య‌మ‌న్నారు. స‌ర‌ళ‌మైన సంస్కృతంలో తెలుగు వారికి సైతం అర్థమ‌య్యేలా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ర‌చించార‌ని తెలిపారు.

చంద్ర‌గిరికి చెందిన డా.షేక్‌షావ‌ళి ‘అన్న‌మ‌య్య, సూర‌దాస్ ప‌ద సంకీర్త‌నల్లో భ‌క్తి – శ్రీ‌కృష్ణ జ‌యంతి’ అనే అంశంపై ఉప‌న్య‌సించారు. సూర‌దాస్ ఉత్త‌రాదిలో, అన్న‌మ‌య్య ద‌క్షిణాదిలో విష్ణుత‌త్వాన్ని విశేషంగా ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. సూర‌దాస్ శ్రీ‌కృష్ణుని కీర్తించ‌గా, అన్న‌మ‌య్య శ్రీ వేంక‌టేశ్వ‌రస్వామివారి వైభ‌వాన్ని వ్యాప్తి చేసిన‌ట్టు వివ‌రించారు. భ‌గ‌వ‌త్ సంకీర్త‌నం ద్వారా మోక్షం ల‌భిస్తుంద‌ని వీరిద్ద‌రూ నమ్మిన‌ట్టు చెప్పారు. న‌వ‌విధ భ‌క్తి మార్గాల అంతిమ‌ల‌క్ష్యం మోక్షం సాధించ‌డ‌మేన‌ని వివ‌రించారు.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయ‌కులు శ్రీ పారుప‌ల్లి రంగ‌నాథ్‌ బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీమ‌తి కె.విశాలాక్ష్మి బృందం గాత్ర సంగీత స‌భ‌ నిర్వ‌హిస్తారు.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో…

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ‌ని‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి  7 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ‌మ‌తి ఆర్‌.బుల్లెమ్మ‌ బృందం గాత్రం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు టిటిడి ఆస్థాన గాయ‌కులు డా. జి.శోభారాజ్ బృందం గాత్ర సంగీత కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య సింగ‌రాజు ద‌క్షిణా‌మూర్తి శ‌ర్మ, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి నాగ‌మ‌ణి, సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ న‌ర‌సింహులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.