Annual Brahmotsavam in Sri Venkateswara Temple, Rishikesh – procession of SURYAPRABHA VAHANAM _ సూర్యప్రభవాహనంపై హృషికేశ్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి

Rishikesh, 10 June 2009: The processional deity of Lord Venkateswara is taken out in a procession of SURYAPRABHA VAHANAM on 7th day of ongoing Annual Brahmotsavam in Sri Venkateswara Temple in Rishikesh Wednesday morning.
 
Sri Rama Rao, Asst Executive Officer, Sri T.Ravi, Public Relations Officer, Temple Staff and devotees took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సూర్యప్రభవాహనంపై హృషికేశ్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి

తిరుపతి, జూన్‌-10,  2009: ఉత్తరఖండ్‌ రాష్ట్రంలోని హృషికేశ్‌ నందు గల తితిదేకు చెందిన ఆంధ్రాశ్రమంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన బుధవారం ఉదయం స్వామివారు సూర్యప్రభవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారు హృషికేశ్‌లోని త్రివేణి ఘాట్‌ రోడ్డు, లక్ష్మణజూలా రోడ్డు, ప్రధానపురవీధులలో ఊరేగారు. అంతక మునుపు ఆలయంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత కార్యక్రమం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ఎండ వేడిమిని కూడా లెక్క చేయక వేలాదిమంది భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఊరేగింపు సమయంలో పురవీధులలో బాలాజీకి జై, గోవిందా, నారాయణ, స్మరణలతో భక్తులు పులకించారు. ఇదే రోజు సాయంత్రం స్వామివారు చంద్రప్రభ వాహనంపై పురవీధులలో ఊరేగారు. అనంతరం ప్రముఖ గాయకులు పండిత్‌ పవన్‌ గోడియాల్‌, కుమారి కవితా గోడియాల్‌చే ఏర్పాటు చేసిన సంగీత విభావరి భక్తులను అలరించాయి. అదేవిధంగా దాససాహిత్య ప్రాజెక్టు కళాకారుల కోలాటాలు, భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోవడమే గాక వారితో స్థానిక భక్తులు సైతం కోలాటాలు వేయడం ఒక విశేషం.

ఈ కార్యక్రమంలో తితిదే ఛీఫ్‌ఇంజనీరు శ్రీ వి.ఎస్‌.బి.కోటేశ్వరరావు, ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవి, ఎ.ఇ.ఓ. శ్రీ కోదండరామారావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శ్రీ శివరామకృష్ణ, క్యాటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీదేశాయ్‌, డిప్యూటి ఇ.ఇ. శ్రీ దామోదరం, ఆలయ అర్చకులు శ్రీరామచంద్రదీక్షితులు, శ్రీకృష్ణశర్మ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం:-

బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు ఉదయం శ్రీహరి సూర్యప్రభ వాహనం అధిష్టించి తేజో విరాజితుడై కన్పించాడు. సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత, వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధమైన హృషికేశ్‌ పురవీధులలో ఊరేగడం ఆనందదాయకం.

శ్రీమన్నారాయణుడు సూర్య మండల మధ్యవర్తి అని-”ధ్యేయ స్సదా సనితృమండలమధ్యవర్తీ నారాయణః” వంటి ప్రమాణాలచే తెలుస్తున్నది. అందుకే నిత్యం ఉదయం భారతీయులకు సూర్యోపాసన చేసే సంస్కృతి అలవడింది. గాయత్రీ మంత్రంతో దేదీప్యమానుడైన సూర్యభగవానుని శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తేజస్సును ఆరాధిస్తాము. ఆ తేజం మన బుద్ధులకు ప్రేరణ నిస్తుంది.

సూర్యుడు సప్తరశ్మి. స్వామి సప్తశైలవాసి. సూర్యడు సప్తాశ్వరథారూఢుడై నిత్యం విహరిస్తూ తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నాడు. సూర్యుడు కర్మసాక్షి. ప్రత్యక్షదైవం, ఆ సూర్యుని ప్రభ వెలుగులీనుతూ వేంకటేశ్వరుని ముందుకు నడపటం ముదావహం. ”ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌” అని ప్రసిద్ధి. మయూరాదులు, సాంబుడు వంటి భక్తులు సూర్యోపాసనచేత ఆరోగ్యవంతులై, కృతకృత్యులైనట్లు ప్రాచీన సారస్వతం నుండి తెలుస్తున్నది.

ఆరోగ్యం సత్కవిత్వం మతి మతులబలం కాంతి మాయుః ప్రకర్షం
విద్యామైశ్వర్య మర్థం  సుతమపి లభతే సో  త్ర సూర్యప్రసాదాత్‌||

ఆరోగ్యమే కాక కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల సిద్ధిస్తున్నాయని సూర్యశతకం తెలియజేస్తున్నది. సూర్యోపాసన చక్షూ రోగనివృత్తి నిచ్చేదిగా యజుర్వేదంలోని చాకక్షుషోపనిషత్తు ప్రభోదిస్తున్నది.

సూర్యప్రభపైన బాలాజీ దర్శనం హృషికేశ్‌ యాత్రికులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఆరోగ్యం, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఈ వాహన సేవ వల్ల భక్తకోటికి సిద్ధిస్తున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.