ANNUAL JYESTABHISHEKAM CONCLUDES IN SRI GOVINDARAJA SWAMY TEMPLE _ కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం
కవచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం
తిరుపతి, జూలై 20, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభి షేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. అక్కడ శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం మహాశాంతిహోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయనాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.
ఘనంగా తులసి మహత్యం ఉత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారికి నిర్వహించాల్సిన గరుడ వాహన సేవను వర్షం కారణంగా రద్దు చేశారు. అంతకుముందు స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి బంగారు వాకిలి వద్ద తులసి మహత్యం ఆస్థానం నిర్వహించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవాన్ని 900 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రవేశపెట్టారని, అప్పటి నుండి నిరంతరాయంగా కొనసాగుతోందని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సుధాకర్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి.ఎస్.బాలాజీ ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.