AYURVEDA AND HOMEOPATHY SHOWED THE WORLD THE GREATNESS OF INDIAN TRADITIONAL MEDICINE-TTD EO _ ఆయుర్వేద వైద్యం భారతదేశం సొంతం : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
ఆయుర్వేద వైద్యం భారతదేశం సొంతం : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, మార్చి 20, 2013: ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యం భారతదేశం సొంతమని, ఇప్పటికీ దీనికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల మొదటి బ్యాచ్ పిజి విద్యార్థులకు బుధవారం పట్టాల ప్రదానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో ప్రసంగిస్తూ ఇంగ్లీషు వైద్యం కంటే కొన్ని వందల ఏళ్ల ముందు ఆయుర్వేద వైద్యం భారతీయులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఇతర దేశస్తులు సైతం భారతదేశానికి వచ్చి ఆయుర్వేద వైద్యా విధానాలతో అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతున్నారని వివరించారు. ఇలాంటి విశిష్టమైన వైద్య విధానాన్ని శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో అభ్యసిస్తున్న విద్యార్థులు అదృష్టవంతులన్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ వైద్యాన్ని పది మందికీ పంచి ఆరోగ్యమైన సమాజ నిర్మాణానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం ఈవో చేతుల మీదుగా పిజి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఆరు సబ్జెక్టులకు చెందిన మొత్తం 32 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతిదేవి, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పి.రామిరెడ్డి, ఇతర విభాగాల అధ్యాపకులు దత్తాత్రేయరావు, శంకర్‌బాబు, పరాంకుశరావు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.