భక్తిరేవ గరీయసి’ అన్నట్లు సాగిన “భక్తిసంగీతం”


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తిరేవ గరీయసి’ అన్నట్లు సాగిన “భక్తిసంగీతం”

తిరుపతి, 16 సెప్టెంబరు 2018; బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజైన ఆదివారం సాయంత్రం స్థానిక అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బెంగుళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని కుమారి పావని కాశీనాథ్ గావించిన ‘భక్తిసంగీతం’ కార్యక్రమం భక్తజనులను భక్తిసాగరంలో ముంచెత్తింది. వీరి తల్లి వైణిక విద్వాంసురాలు, తండ్రి మృదంగ విద్వాంసులు ఎ వి కాశీనాథ్.

కార్యక్రమం తొలుత ‘నన్నుబ్రోవ’ వర్ణంతో ప్రారంభించారు. ఆపై ‘జయ జయ జానకి కాంత జయ జయ సాదు జన వినుత’ పురన్దరదాస విరచిత, తదుపరి మైసూర్ వాసుదేవాచార్య కృత ‘గురుకృప సద్గురుకృప లేక’ కీర్తన, అటు తర్వాత త్యాగరాజ కృతులైన ‘నీ చిత్తము నీ ఇష్టము నిర్మలము’, ‘మేరు సమాన ధీర వరద రఘువీర’, పట్నం సుబ్రహ్మణ్యుల వారి ‘మరి వేరే దిక్కెవ్వరు రామయ్య’ కీర్తనలు, చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) రచిత ‘ఉఱైన్రుమ్ ఇల్లై’ పాటను పాడి సభాంగణాన్ని మంత్రముగ్ధులను గావించారు. కార్యక్రమానికి మృదంగంపై వీరి తండ్రి ఎ వి కాశీనాథ్, వాయులీనంపై నరసింహులు సహకరించి సభాప్రాంగణాన్ని భక్తి సంగీతఝరిలో ముంచెత్తారు. ఈ భక్తిసంగీత కార్యక్రమం తి తి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది.

తితిదేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహించిన ఈ భక్తిసంగీత కార్యక్రమంలో హెచ్ డి పి పి కో-ఆర్డినేటర్ పి. కృష్ణమూర్తి, తిరుపతి పుర భక్తజనులు పాల్గొన్నారు.

అలాగే తిరుపతి మహతి కళాక్షేత్రంలో సా.6.30 – 8.30 గంటల వరకు సికింద్రాబాద్‌కు చెందిన డా.. జ‌య‌ప్ర‌ద రామ‌మూర్తి బృందం వేణుగాన వాద్య సంగీతం, తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో సా.6.30 -8.30 గంటల వరకు విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన అకొండ వెంక‌ట‌రావు బృందం నామసంకీర్తన నిర్వహించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.