ముత్యపుపందిరి వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపుపందిరి వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

నవంబరు 17, తిరుపతి, 2017: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరి వాహనసేవలో 2 ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి కలిసి ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రంథ రచయిత డా|| మధురాంతకం నరేంద్రను శ్రీవారి ప్రసాదం, శాలువతో ఘనంగా సన్మానించారు. ఆ పుస్తకాల గురించి సంక్షిప్త సమాచారం.

వేమన :

భారతజాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసే చక్కని సంస్కృతికి మన చిన్నారులను వారసులుగా తీర్చిదిద్దే సంకల్పంతో ఆదర్శవంతులైన కొందరు మహాత్ముల జీవిత చరిత్రలను శ్రీనివాస బాలభారతి పేరుతో టిటిడి తెలుగులో 100కు పైగా పుస్తకాలను ముద్రించింది. వీటిని ఇంగ్లీషు, హిందీ భాషల్లో అనువదింపజేసి విశ్వవ్యాప్తం చేసింది.

తెలుగు సాహిత్యంలో వేమన శతకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వేమన తన పద్యాలద్వారా సమాజానికి హితబోధ చేశాడు. వేమన పద్యాలు రాని తెలుగువాడంటూ ఉండడు. తెలుగులో జి.భానుమూర్తి రాసిన ‘వేమన’ అనే ఈ పుస్తకాన్ని డా|| మధురాంతకం నరేంద్ర ఆంగ్లంలోకి అనువదించారు.

దధీచి :

తెలుగులో శ్రీ టి.లక్ష్మీనారాయణగారు రాసిన దధీచి పుస్తకాన్ని డా|| మధురాంతకం నరేంద్ర ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని చదివి త్యాగగుణం ఎలా ఉండాలనే విషయాన్ని పిల్లలు తెలుసుకుంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.