GODDESS CHEERS DEVOTEES AS “VENNAMUDDA KRISHNUDU”_ ముత్యపుపందిరిపై వెన్నముద్ద కృష్ణుడిగా శ్రీపద్మావతి

Tiruchanur, 17 November 2017: On the third day morning on Friday, as a part of the ongoing Navahnika Karthika Brahmotsavams, Goddess Padmavathi Devi cheered the devotees in “Vennamudda Krishna” alankaram on Mutyapu Pandiri Vahanam.

The celestial carrier made of pearls enhanced the charm of Goddess who appeared as Lord Chinni Krishna trying to climb ladder to steal the butter from pot while another hand holding butter ball.

The devotees were thrilled to see Goddess in this unique Avatar which reminded every one of “Krishna Leela”.

TTD EO Anil Kumar Singhal, JEO Tirupati Sri P Bhaskar, Spl Gr DyEO Sri Muniratnam Reddy and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముత్యపుపందిరిపై వెన్నముద్ద కృష్ణుడిగా శ్రీపద్మావతి

నవంబరు 17, తిరుపతి, 2017: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అవతారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 9.30 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశాడు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.

మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

అలాగే, రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.

టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ముత్యపుపందిరి వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. నవంబరు 23న పంచమితీర్థం రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. రోజంతా పంచమితీర్థం ప్రభావం ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుష్కరిణిలో స్నానాలు ఆచరించాలని కోరారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్‌వో శ్రీపార్థసారధిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.