పుస్తకావిష్కరణ….
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
పుస్తకావిష్కరణ….
సెప్టెంబరు 16, తిరుమల 2018: కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుధానారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, ఉప సంపాదకులు డా|| నొస్సం నరసింహాచార్య ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
సేక్రేడ్ వేవ్స్ – డా|| కె.కూర్మనాథం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కలియుగ ప్రత్యక్షదైవము అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లీలావైభవం అపారమైనది. స్వామివారి లీలలను వర్ణిస్తూ ఈ లోకంలోని ప్రజలకు సత్ జ్ఞానాన్ని, అపారమైన భక్తిని ప్రసాదించమని శరణాగతుడౌతూ స్వామివారి పవిత్ర తరంగాలను మనవైపు మళ్ళిస్తూ స్తుతిస్తూ చేసిన రచన ఈ సేక్రేడ్ వేవ్స్. ఈ గ్రంథంలో స్వామివారిని, అమ్మవారిని, సప్తగిరులను, స్వామిపుష్కరిణిని, వివిధ తీర్థాలవైభవాలను స్తుతిస్తూ వ్రాసిన కవితలు ఉన్నాయి. ఈ గ్రంథ రచయిత డా.కె.కూర్మనాథం.
భాగవత కథాసుధ – డా|| కావూరిపాపయ్య శాస్త్రి
భక్తిరస పరిపూర్ణమైన భాగవతాన్ని ఎందరో రచయితలు తమతమ విద్వత్తుననుసరించి పద్యంగానూ గేయంగాను, వచనంగాను హరికథ గాను ఇలా వివిధ ప్రక్రియలలో అందించారు. భాగవతాన్ని ఎలా అందించినా దాని మాధుర్యంలో ఏ మాత్రం తేడా ఉండదు. భాగవత కథా సుధ అనే ఈ గ్రంథంలో రచయిత డా|| కావూరి పాపయ్యశాస్త్రి గారు భాగవతంలోని సుప్రసిద్ధ ఘట్టాలను గేయరూపంలో అలతి అలతి పదాలతో అందిస్తున్నారు. భాగవత కథా సుధ ఇదివరకే ఒక భాగాన్ని తి.తి.దే ముద్రించింది. ఇది రెండవ భాగం ఇందులో మత్సావతారం మొదలు పరీక్షిత్తు కథవరకు 12 కథలను గేయాల రూపంలో అందించారు రచయిత.
శిశుపాలవధ (భారత ఉపాఖ్యాన గ్రంథమాల)
మహాభారతంలోని సభాపర్వంలోని ”శిశుపాలవధ” అనే ఈ ఘాట్టనికి డా|| అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు వ్యాఖ్యానాన్ని అందించగా డా||పి.ఆర్.హరినాథ్ గారు పీఠికను సంతరించారు. ఈ ఘట్టంలో ఛేది దేశానికి రాజైన శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్త కుమారుడు.పుట్టుకతో వికృత రూపుడైన శివుపాలునికి ఎవరిచేతిలో మంచి రూపం వస్తుందో వారిచేతిలోనే అతని మరణం సంభవిస్తుందని అతని మరణ రహస్యం. శ్రీకృష్ణుడు శిశుపాలుని తాకగానే అతని వికృత రూపంపోయి చక్కటి సౌందర్యవంతమైన రూపం కలుగుతుంది. కృష్ణుని చేతిలోనే శిశుపాలునికి మరణం కలుగుతుందని తెలుసుకున్న కృష్ణుని మేనత్త అతనిని శిశుపాలునిప్రాణభిక్ష కోరుకుంటుంది.శ్రీకృష్ణుడు శిశుపాలుడు వందతప్పులు చేసేవరకు వేచిఉంటానని ఆపై అతనికి మరణం తప్పదని వరాన్నిస్తాడు. ధర్మరాజు రాజసూయ యాగంలో ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇవ్వబోగా తన మూర్ఖత్వంతో శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించడం అతని తప్పులన్నీ పూర్తయ్యేవరకు శ్రీకృష్ణుడు వేచివుండి అతనిని సంహరించడం ఈ ఘట్టంలోని కథాంశాలు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.