పెద్దశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
పెద్దశేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి, 2018 డిసెంబరు 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం పెద్దశేషవాహనంపై మువ్వగోపాలుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన ఆళ్వారుల సంగ్రహ చరిత్ర, ఏకాదశీవ్రత మహిమ పుస్తకాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం రచయితలను శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా.. తాళ్లూరు ఆంజనేయులు, ఉపసంపాదకుడు డా.. నొస్సం నరసింహాచార్య పాల్గొన్నారు.
ఆళ్వారుల సంగ్రహ చరిత్ర పుస్తకాన్ని శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు రచించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారిని తమ పాశురాలతో, ద్రవిడ ప్రబంధాలతో స్తుతించి తరించిన వైష్ణవ భక్తాగ్రేసరులు ఆళ్వారులు. వీరికి శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒక విశిష్ట స్థానం ఉంది. వీరు 12 మంది. వీరు వివిధ కులాల్లో, వేరువేరు కాలాల్లో పుట్టినా భగవత్ ప్రావీణ్యం అందరికీ సమానమే. ఇంతటి మహనీయుల, పుణ్యచరితుల జీవిత విశేషాలు ముందుతరాల వారికి తెలియజేయాలనే సంకల్పంతో టిటిడి ఈ గ్రంథాన్ని ముద్రించింది.
ఏకాదశీవ్రతమహిమ పుస్తకాన్ని శ్రీమతి భక్తికాదేవిదాసి రచించారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురువు పాదసేవ, ఏకాదశీ వ్రతం ఈ మూడు అత్యంత కష్టసాధ్యాలని బ్రహ్మాండాది పురాణాలు చెబుతున్నాయి. హైందవ సంప్రదాయం ప్రకారం ఏకాదశినాడు అనారోగ్యపీడితులు, బాలింతలు, శిశువులు తప్ప మిగిలిన వారందరూ ఉపవాసం చేసి మరుసటిరోజు శ్రీహరిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వం అంబరీషుడు తదితర పురాణ పురుషులు ఈ వ్రతాన్ని ఆచరించి వైకుంఠాన్ని చేరుకున్నారు. సంవత్సరంలో 26 ఏకాదశులు ఉన్నాయని ఆయా ఏకాదశుల మహాత్యాలను పద్మపురాణం చక్కగా వివరించింది. పద్మపురాణంలోని 26 ఏకాదశుల మహత్యాలను వివరిస్తూ శ్రీమతి భక్తికాదేవిదాసి రాసిన గ్రంథమే ఇది. భక్తులందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవంతుని కృపకు పాత్రులు కావాలనే సంకల్పంతో టిటిడి ఈ గ్రంథాన్ని ప్రచురించింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.