BRAHMOTSAVAMS OF BRAHMANDA NAYAKA-THE UNIVERSAL LORD _ బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వం

THE MEGA FESTIVAL IS BACK TO ALLURE MILLIONS OF DEVOUT

 

TIRUMALA, 25 SEPTEMBER 2022: Millions of pairs of eyes from across the globe are eagerly waiting for the most auspicious and grandeur event, the annual Brahmotsavams of Sri Venkateswara Swamy in Tirumala, which is all set to take place between September 27 till October 5, after a gap of two years due to Covid Pandemic.

 

Among the 450 odd festivals that are being observed every year in Tirumala as per the Vaikhanasa Agama tradition, the nine-day celestial festival is considered to be the festival of splendour and gaiety as the processional deity of Sri Malayappa Swamy in all His spiritual grandeur, decked with jewellery and flowers, wearing bright coloured pattu vastrams take celestial ride on 16 different carriers all along the four mada streets to bless His beloved devotees.

 

The nine-day festival commences with the ceremonious Ankurarpanam or Beejavapanam, which is considered to be the ritual of prelude before commencing the mega religious fete.

 

Ankurarpanam (September 26)

 

The initial ritual of Ankurarpanam will be observed in the evening. The Navadhanyas are sown in different mud pots invoking the blessings of Moon God

The level of sprouting of the grains becomes the benchmark of hurdle-free and successful conduction of the annual Brahmotsavams.

 

Dwajarohanam (September 27)

 

The Garuda flag of Sri Venkateswara is hoisted in the evening after the procession of the utsava murthis on a gold Tiruchi. This signifies the invitation by the ardent devotee and noble servant of Srivaru, the Garuda, to the deities of all worlds present in Hindu Sanatana Dharma, to take part in the nine-day festival and make it a humongous success.

 

Pedda Shesha Vahanam (September 27)

 

The first Vahanam of the Festival is the seven hooded mighty divine serpent Pedda Sesha Vahanam, where in Sri Malayappa Swamy with Sridevi and Bhudevi takes a celestial ride along the four Mada streets. The Pedda shesha vahanam is symbolic with Dhyana Bhakti.

 

Chinna Sesha Vahanam (September 28)

 

The Second Vahana Seva of the Brahmotsavams is the Chinna Shesha Vahanam which is symbolic with another divine serpent Vasuki and avowed to beget boons of Kundalini yogam.

 

Hamsa Vahanam  (September 28 )

 

On the second day evening, Sri Malayappa decked as Saraswathi-the deity of Wisdom, on a beautiful Hamsa  – the Swan carrier which is depicted in legends as a true icon of justice and peace. The devotees are charmed into devotion and surrender (Saranagati) to the Lord and given up arrogance.

 

Simha Vahanam (September 29)

 

On Day 3 of the festival, Sri Malayappa rides on Simha vahanam, the Half Human Half Lion form showcasing the strength, power and speed as ingredients of His divine existence.

 

Muthyapu Pandiri (September 29)

 

On the night of Day-3 of Brahmotsavam, the Lord rides on a palanquin of pearls, as symbolic of Moon, for peace and tranquillity. This vahanam is said to dispel all violence in devotees’ life and society at large.

 

Kalpavruksha Vahanam (September 30) 

 

The Kalpavruksha vahanam in the morning on fourth day of the Navahnika Brahmotsavams is considered as one of the highlights of the festival as darshan of Srivaru with His two Consorts on this vehicle will bestow all the boons sought by the devotees. The Kalpavruksha has mythological and legendry intones of Sagara Mathanam.

 

Sarva Bhopala vahanam (September 30)

 

The Sarva Bhopala vahanam, on fourth day evening, epitomises the universal supremacy of the Lord of Lords, Sri Venkateswara. The powerful deities of the galaxy-Indra, Kubera, Varuna, Yama, Viruthi, Parameswara and Vayu (Astha Dikpalakas) will work as per dictates of Lord Venkateswara.

 

Mohini vahanam (October 1)

 

On the fifth day morning, Sri Malayappa decked as the Universal Celestial Beauty, Mohini charms every one accompanied by Sri Krishna Swamy on another palanquin. This avatar depicted that Srivaru cautions devotees to break the chasm of Maya in this materialistic world.

 

Garuda Vahanam (October 1)

 

On the fifth day, the middle day of the nine-day celestial brahmotsavams, Garuda Vahanam is observed which is considered to be the most auspicious vehicle among all carriers of Sri Venkateswara. Devotees converge in lakhs to witness the majesty of Sri Malayappa on the mammoth Garuda vahanam.

 

Hanumantha Vahanam (October 2)

 

On the morning of the sixth day, Sri Malayappa as Sri Rama blesses His devotees on the most significant Hanumantha vahana. This vahanam is expected to yield philosophical satisfaction to devotees.

 

Golden Chariot (October 2) 

 

The processional deity of Sri Malayappa Swamy was taken out on a procession on the Swarna Ratham. The grandeur of the Ratham and the procession is a cynosure to the devotees.

 

Gaja Vahanam  (October 2) 

 

In the evening, Sri Malayappa rides on the divine Elephant carrier symbolising the devotion and surrender philosophy (saranagati) of Vaikanasa sect of Vaishnavism. 

 

Surya Prabha Vahanam (October 3) 

 

On the seventh day morning, Sri Suryanarayana tales celestial ride on the Surya Prabha Vahanam symbolizing the powers  of Sun God and the role of Sun in the life of mankind.

 

Chandra Prabha vahanam ( October 3)

 

In the evening, Sri Malayappa graces His devotees on Chandraprabha vahanam displaying peace, tranquillity as premiere media of achieving the devotion and well-being in the society.

 

Rathotsavam (October 4 )

 

In the morning of the penultimate day of  Srivari Brahmotsavam, the mammoth wooden chariot-Rathotsavam will be conducted on the mada streets. This event symbolises the philosophy of Atma and the body in Hinduism. Lord blesses the devotees to achieve bliss and also do soul-searching of their good and bad acts.

 

Aswa vahanam (October 4)

 

Among all the vahana sevas, Aswa vahanam is the last one in the annual Brahmotsavams at Tirumala. According to Krishnayajurveda, Horse stood for control of all body elements and Lord displayed His identity as a model of Kali, who gave boons to devotees.

 

Chakrasnanam (October 5)

 

This is the final event of the Brahmotsavam when the Utsava idols of Sri Malayappa, Sridevi and Bhudevi along with the anthropomorphic form of Lord, Sri Sudarshana Chakrathalvar were given final Abhisekam and led to Pushkarini for holy bath before they returned to the Ananda Nilayam. Thousands of devotees line up at the Swami Pushkarini to take a holy dip in the sacred waters.

 

Dhwajavarohanam (October 5)

 

The Garuda flag will be lowered on the last day night indicating the grand conclusion of the nine-day mega event.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ్ర‌హ్మాండ‌నాయ‌కుని బ్ర‌హ్మోత్స‌వం

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

– సెప్టెంబ‌రు 26న అంకురార్ప‌ణ‌

– సెప్టెంబరు 27న ధ్వ‌జారోహ‌ణంనాడు ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

– వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం ఇలా…

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 25: పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ ఉత్స‌వాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వివిధ వాహ‌నాల‌పై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు దివ్య‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

ప్ర‌పంచ మాన‌వాళి సంక్షేమాన్ని కాంక్షించ‌డంతో పాటు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి దివ్య‌మైన ఆశీస్సుల‌ను భ‌క్తులంద‌రికీ అందించేందుకు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను టిటిడి నిర్వ‌హిస్తుంది. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుండి అర్ధ‌రాత్రి ఒంటి గంట వరకు జరుగుతుంది.

క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించ‌నున్నందున విశేషంగా విచ్చేసే భ‌క్తులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తులంద‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేశాయి.

ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాల‌రీల‌లో వేచివుండే భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీరు, మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

సెప్టెంబ‌రు 26న అంకురార్పణం

సెప్టెంబ‌రు 26న సోమ‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.

సెప్టెంబ‌రు 27న ధ్వజారోహణం

సెప్టెంబర్ 27వ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.

వాహ‌న సేవ‌ల వైశిష్ట్యం ఇలా….

పెద్దశేషవాహనం(27-09-2022)(రాత్రి 9 గంటలకు)

మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

చిన్నశేషవాహనం(28-09-2022)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

హంస వాహనం(28-09-2022)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.

సింహ వాహనం(29-09-2022)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు – భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.

ముత్యపుపందిరి వాహనం(29-09-2022)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.

కల్పవృక్ష వాహనం(30-09-2022)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం(30-09-2022)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.

మోహినీ అవతారం (01-10-2022)(ఉదయం 8 గంటలకు)

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.

గరుడ వాహనం(01-10-2022)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం(02-10-2022)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

స్వర్ణరథం(02-10-2022)(సాయంత్రం 4 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.

గజవాహనం(02-10-2022)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.

సూర్యప్రభ వాహనం(03-10-2022)(ఉదయం 8 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి.

చంద్రప్రభ వాహనం(03-10-2022)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హ దయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

శ్రీవారి రథోత్సవం(04-10-2022)(ఉదయం 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుధ్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం.

అశ్వవాహనం(04-10-2022)(రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.

చక్రస్నానం(05-10-2022)(ఉదయం 6 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.

ధ్వజావరోహణం(05-10-2022) (రాత్రి 7 గంటలకు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.