BUDGET FESTIVAL ON JULY 17_ జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

Tirumala, 30 Jun. 18: The annual budget festival, which is popularly known as Anivara Asthanam will be observed in Tirumala on July 17.

The temple cleansing fete, Koil Alwar Tirumanjanam will be performed on July 10 in connection with this fete.

TTD has cancelled Astadalapada Padmaradhana Seva on July 10 and Kalyanotsavam, unjal seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Seva on July 17.

Meanwhile there will be Pushpa Pallaki on the evening of July 17 in connection with Salakatla Anivara Asthanam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

జూన్‌ 30, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. ఇందుకోసం జులై 10న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.

చారిత్రక నేపథ్యం :

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

ఆర్జితసేవలు రద్దు :

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జులై 17వ తేదీ మంగళవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఉత్సవ విశిష్టత :

ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.

జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ :

శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచుతారు.

పుష్ప పల్లకీపై ఊరేగింపు :

ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

జులై 10న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :

ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జులై 10వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు గర్భాలయం, ఉప ఆలయాలు, పోటును శుద్ధి చేస్తారు. ఈ కారణంగా అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.