CARNATIC MUSIC TRINITY ARADHANOTSAVAMS COMMENCES_ ఎస్వీ సంగీత కళాశాలలో వైభవంగా సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ప్రారంభం

Tirupati, 6 February 2019: The Aradhanotsavams of Carnatic musical Trinity, Sri Shyama Shastry, Sri Tyagaraja Swamy and Sri Muttuswamy Deekshitulu commenced on a grand note in the SV College of Music and Dance in Tirupati on Wednesday. This three day fete will conclude on February 8.

The intention of this programme is that to bring back into limelight the sankeertans penned by this Trimurthy of Karnataka Sangeetham which were fading away and to impart the knowledge to the music students. The faculty and children of the college performed special pujas to the statues of Trinity under the leadership of Smt YVS Padmavathi, the Principal of the College.

In the evening the students and faculty rendered Tyagaraja, Muttuswamya and Shyama Sastry kritis in the college auditorium.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఎస్వీ సంగీత కళాశాలలో వైభవంగా సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు ప్రారంభం

ఫిబ్రవరి 06, తిరుపతి, 2019: కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్యామశాస్త్రులు, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో బుధవారం ఉదయం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 8వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. పలు కీర్తనలు మరుగున పడుతున్న నేపథ్యంలో వాటిని వెలుగులోకి తీసుకువచ్చి విద్యార్థులకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

ముందుగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఉదయం 9.00 గంటలకు ప్రిన్సిపాల్‌ శ్రీమతి. వై.వి.యస్‌.పద్మావతి ఆధ్వర్యంలో

ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు కలసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి శ్రీవారి చిత్రపటాన్ని ఊరేగింపుగా మేళతాళాల మధ్య కళాశాల వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత శ్రీ వి.సత్యనారాయణ బృందం, శ్రీ బి.కేశన్న, శ్రీమతి లక్ష్మీసువర్ణ బృందాలు నాదస్వర వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సంగీత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, స్థానిక కళాకారులు పలు కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు శ్రీ ఎ.చెన్నయ్య వేణువు, శ్రీ కె.వెంకటకృష్ణ వయొలిన్‌ వాద్యప్రదర్శనలిచ్చారు. శ్రీమతి సి.సంగీతలక్ష్మి సంగీతోపన్యాసం చేశారు.

ఆకట్టుకున్న త్యాగయ్య పంచరత్న కృతుల బృందగానం :

ఆరాధనోత్సవాల్లో భాగంగా సాయంత్రం జరిగిన శ్రీ త్యాగరాజస్వామివారి ఘనరాగ పంచరత్న కృతుల బృందగానం ఎంతగానో ఆకట్టుకుంది. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి దాదాపు 100 మంది గానం చేశారు. ఇందులో ”జగదానందకారక…., దుడుకుగల…., సాధించెనే…., కనకనరుచిరా…., ఎందరో మహానుభావులు….” తదితర కీర్తనలున్నాయి. అనంతరం ఉత్సవ, దివ్యనామ సంకీర్తనల బృందగానం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో శ్రీ రామచంద్ర, కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ శ్రీమతి జమునరాణి, ఎస్వీ నాదస్వర పాఠశాల హెడ్‌మాస్టర్‌ శ్రీ సత్యనారాయణ, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు.
శ్రీశ్యామశాస్త్రి (1762-1827) :

సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి తిరువారూరులో జన్మించారు. తంజావూరులో స్థిరపడ్డారు. తరతరాలుగా బంగారు కామాక్షిని పూజించిన కుటుంబ వీరిది. వీరికి వేంకటసుబ్రమణ్యం అనే పేరుంది. తెలుగు, తమిళ, సంస్కృత భాషల్లో విశేష ప్రావీణ్యం సంపాదించారు. వీరికి శ్రీత్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు సమకాలికులు. వీరి భైరవి, తోడి, యదుకుల కాంభోజి రాగాల్లోని స్వరజతులు గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాళంలో వీరు చూపిన కొత్త పోకడ ప్రశంసనీయం. వీరి కృతులు శ్యామకృష్ణ ముద్రతో ఉంటాయి. వీరి నవరత్నమాలిక కృతులు చాలా ప్రసిద్ధి పొందాయి. కీర్తనలకు చిట్ట స్వరాలు, వాటికి సాహిత్యం వీరి నుండే ప్రారంభమైంది.

శ్రీ త్యాగరాజస్వామి (1767-1847) :

శ్రీ త్యాగరాజస్వామివారు తంజావూరు జిల్లాలోని తిరువారూరు క్షేత్రంలో శ్రీమతి సీతమ్మ, శ్రీరామబ్రహ్మం దంపతులకు జన్మించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో రెండోవారుగా ప్రసిద్ధిచెందారు. నాదోపాసనే మోక్షహేతువని నమ్మి తరించిన నాదయోగి త్యాగయ్య చిన్నతనం నుండే భక్తి వాతావరణంలో పెరిగారు. 24 వేల కృతులు ఆలపించారని ప్రచారంలో ఉన్నా ప్రస్తుతం 750 కృతులు మాత్రమే లభ్యమవుతున్నాయి. శ్రీ రామకృష్ణానంద యతీశ్వరుల ఉపదేశంతో 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి రామ సాక్షాత్కారం పొందిన భాగవత శిరోమణి ఈయన.

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు (1775-1835) :

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు తిరువారూరులో రామస్వామి దీక్షితులు, సుబ్బలక్ష్మి అమ్మాళ్‌ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండి భగవధ్యానపరులు. వీరు కాశీ క్షేత్రానికి వెళ్లి చిదంబరనాదయోగి వద్ద శ్రీవిద్యా ఉపదేశం చేశారు. గురువుల ఆశీస్సులు వారి ఆజ్ఞానుసారం తిరుత్తణి క్షేత్రంలో 45 రోజులుండి శ్రీ సుబ్రమణ్యస్వామిని ఉపాసించారు. వీరి కృతులు చాలావరకు సంస్కృతంలో ఉంటాయి. వీరి కమలాంబ నవార్ణకృతులు, నవగ్రహకృతులు, విభక్తి కృతులు, పంచలింగస్థల కృతులు, షోడశగణపతి కృతులు ప్రసిద్ధి పొందాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.