వాయుపుత్రుడు హనుమంతుడు ఎక్క‌డ ఉంటారో అక్క‌డ ప్రాణ‌పాయం ఉండ‌దు : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

వాయుపుత్రుడు హనుమంతుడు ఎక్క‌డ ఉంటారో అక్క‌డ ప్రాణ‌పాయం ఉండ‌దు : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

తిరుపతి, 14 జనవరి, 2019: వాయుపుత్రుడు హనుమంతుడు ఎక్క‌డ ఉంటారో అక్క‌డ ప్రాణ‌పాయం ఉండ‌దని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో సోమ‌వారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో హనుమద్వైభవం – సమాజ స్ఫూర్తి అనే అంశంపై రెండ‌వ రోజు ఆయన ధార్మిక ఉపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ శ్రీ‌రాముడి సంతోషం కోసం, వాన‌రజాతి ప్ర‌తిష్ట కోసం లంక‌లోని సీత‌మ్మ జాడ క‌నుక్కునేందుకు త‌న స‌ర్వ శ‌క్తుల‌ను ధార‌పోసి లంక‌కు ఆంజ‌నేయుడు చేరాడ‌న్నారు. సీత‌మ్మ‌త‌ల్లి జాడ‌ను క‌నుగొని, శ్రీ‌రాముడి యోగ‌క్షేమాలు తెలిపిన‌ది హ‌నుమంతుడ‌ని తెలిపారు. మ‌న‌స్సుతో వెళ్లి శ‌రీరంతో ప‌నిచెస్తే ఎవ‌రైన విజ‌యం సాధించ‌వ‌చ్చ‌న్నారు. మ‌న‌స్సు బ‌ల‌హీనంగా ఉంటే ఏమీ చేయ‌లేరు, కావున హ‌నుమంతుడు మ‌న‌స్సు, శ‌రీరం రెండు బలంగా ఉండ‌టం వ‌ల్ల విజ‌యం సాధించిన‌ట్లు వివ‌రించారు. హ‌నుమంతుడు ఎంత‌టి బ‌ల‌వంతుడైన త‌న శ‌క్తిని ఏనాడు స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించ‌లేద‌న్నారు.

అదేవిధంగా సీత‌మ్మ‌త‌ల్లి సామాన్య మ‌హిళ కాద‌ని, ఐదు త‌ల‌ల స‌ర్పంకు ఉన్న శ‌క్తి సీత‌మ్మ‌కు ఉంద‌ని, శ్రీ‌రాముడు సామాన్య వ్య‌క్తి కాద‌ని, ఆయ‌న యుద్ధానికి వ‌స్తే నిల‌బ‌డ‌లేవ‌ని రావ‌ణాసురుడికి హిత‌భోద చేశార‌ని వివ‌రించారు. ప్ర‌జ‌లు భగవంతునిపై నమ్మకం ఉంచితే భయం లేకుండా జీవించడం సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో హిందూధర్మప్రచార పరిషత్ అధికారులు, పెద్ద ఎత్తున తిరుపతి పుర ప్రజలు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.