CHAKRASNANAM HELD_ వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Tirumala, 26 September 2023: On the last day morning on Tuesday of the ongoing annual Brahmotsavam fete the sacred Avabritha Chakra Snanam was performed to the holy disc-Sudarshan Chakrattalwar.

The temple priests performed ‘Snapana Tirumanjanam’ to ‘Utsavarulu’ and ‘Sri Sudarshana Chakrattalwar’ reciting ‘Purusha-Sri-Bhu Suktams’ as per ‘Vaikhanasa Agamavidhi’.

According to Hindu Scriptures, Sudarshana Chakra is a spinning, disk-like weapon with 108 serrated edges of Lord Sri Maha Vishnu. The Sudarshana Chakra may be depicted as an Ayudhapurusha (Anthropomorphic form). He is depicted as a fierce form of Vishnu and deployed for the ultimate destruction of an enemy. 

In Tirumala, ‘Chakra Snanam’ is performed to Chakrattalwar four times in a year during annual Brahmotsavams, Vaikuntha Dwadasi, Ratha Sapthami and during Anantha Padmanatbha Vratam.

Tirumala Pontiffs, Chairman Sri Karunakara Reddy, Rajya Sabha MP Sri Prabhakar Reddy, EO Sri AV Dharma Reddy, TTD and district top brass officials and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

తిరుమల, 2023 సెప్టెంబరు 26: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామివారి శిష్య‌బృందం పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ అర్చ‌కం రామ‌కృష్ణ దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.
ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌ణ క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ధ్వజావరోహణం :

చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

అనంతరం రాత్రి 7 నుండి 9 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.