CHAKRASNANAM MARKS THE GRANDEUR CLOSING CEREMONY OF BTUs IN SKVST_ వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Srinivasa Mangapuram, 14 February 2018: The annual brahmotsavams in the famous temple of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram came to a grand conclusion with Chakrasnanam.

Earlier during the day, snapana tirumanjanam was performed to the utsava murties chanting relevant mantras. Later the Vedic pundits offered holy dip to Sri Sudarshana Chakrattalwar in holy pushkarini. The devotees also took holy dip chanting govinda nama during that auspicious moment.

Local Temple DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Exe Engineer Sri Manohan, DyEE Sri Ramamurthy, Chief Kankana Bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY THE TTDS PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 14: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

అంతకుముందు ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.30 గంటల నుండి 10.00 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.

చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శనచక్రంకు (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీ భూసమేతమలయప్పమూర్తికి ‘స్నపన తిరుమంజనం’ నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణీజలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.

చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

ఈ సందర్భంగా టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల విశేషాలు :

– ఆలయంలోని పోటులో రోజుకు 20 వేల నుంచి 25 వేల మంది భక్తులకు ఎనిమిది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు.

– టిటిడి అన్నప్రసాదం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఐదు వేల మందికి సాంబారు అన్నం, పెరుగన్నం, పాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.

– టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో మీడియా సెంటర్‌ ఏర్పాటుచేసి బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 150 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

– టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో రోజుకు వెయ్యి మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో రోజుకు వెయ్యి మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

– ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 60 టన్నుల పుష్పాలు వినియోగించారు. 80 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపనతిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు.

– ఆలయంలో ప్రతిరోజూ 113 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.