భక్తిపారవశ్యంగా సాగిన “భక్తి సంగీతం”
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
భక్తిపారవశ్యంగా సాగిన “భక్తి సంగీతం”
తిరుపతి 2018 సెప్టెంబరు 19: పరాత్పరుడు-కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలలో నేడు ఏడవ రోజు. నేటి సాయంకాలం బ్రహ్మోత్సవాల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో విశాఖపట్టణానికి చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రులైన, వైజాగ్ సిస్టర్లుగా పేరుగాంచిన ఎస్ సాయిప్రశాంతి & ఎన్ సి సాయి సంతోషి గార్ల “భక్తిసంగీత” కార్యక్రమం భక్త జన సదస్యులను భక్తిసాగరంలో ముంచెత్తారు. వీరు 2012 వ సంవత్సరంలో ఇదే వేదికమీద అన్నమయ్య సంకీర్తనలను ముప్పై మూడు గంటలపాటు నిర్విరామముగా పాడి రికార్డు సృష్టించారు.
నేటి కార్యక్రమం ఆసాంతం అన్నమాచార్య కీర్తనలు కర్ణపేయం గా ఆలపించి సభను పులకింపచేశారు. వీరు మొదట ‘నమో నమో రఘుకుల నాయక’తో ప్రారంభించారు. అటుపై ‘శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ, వందేహం జగద్వల్లభమ్, తిరువీధుల మెరసీ దేవ దేవుడు, వాడే వెంకటాద్రి మీద, అణురేణు పరిపూర్ణమైన రూపము, సింగారమూరితివి చిత్తజా గురుడు’ అన్న కీర్తనలు గానం చేసి సభను మైమరపించారు.
వీరికి మృదంగం పై ప్రసాద్, వాయులీనం పై పవన్, ఘటం పైన నాగరాజు, మోర్సింగ్ పై స్వామి లు సహకరించి సభను భక్తి పారవశ్యంలో ఓలలాడించారు.
ఈ కార్యక్రమం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ తరపున డా||పూర్ణవల్లి పర్యవేక్షించగా, ఇంకా కార్యక్రమంలో సప్తగిరి మాసపత్రిక ఉపసంపాదకురాలు డా||అల్లాడి సంధ్య, పుర ప్రముఖులైన రాధాకృష్ణ మరియు భక్తజనులు వీక్షించారు.
కాగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ నరేష్ బృందం భరతనాట్యం, రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులచే వాద్య, గ్రాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.