భజన మండళ్ల సభ్యులు గ్రామస్థాయిలో భజన సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేయాలి : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
భజన మండళ్ల సభ్యులు గ్రామస్థాయిలో భజన సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేయాలి : తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుపతి, 2017 అక్టోబరు 28:సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గల భజన మండళ్ల సభ్యులు గ్రామ స్థాయిలో యువతలో భజన సంస్కృతిని మరింత పెంచాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పిలుపునిచ్చారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు శనివారం తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఉత్తమ ప్రదర్శనలిచ్చే భజన బృందాలకు ఆగస్టు 15వ తేదీన బహుమతులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నట్లు తెలిపారు. టిటిడి ఈవో ఆదేశాల మేరకు ఎస్వీబిసిలో వారానికి ఒక్కసారి 30 నిమిషాల పాటు భజన కార్యక్రమాలు ప్రసారం చేసేలా చర్యలు చేపటినట్లు వివరించారు. దాససాహిత్య ప్రాజెక్టులోని భజన మండళ్ల సభ్యులు క్రమశిక్షణ, నైపుణ్యం కలిగి వున్నట్లు అభినందించారు. భజన మండలి సభ్యులు వివరాలను కంప్యూటరీకరించి, అందరికి అవకాశం వచ్చేలా చర్యలు తీసుకోవాలని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులును ఆదేశించారు. దాససాహిత్య ప్రాజెక్టు బలోపేతానికి, మెట్లోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు టిటిడి తన వంతు సహకారాని అందిస్తుందని తెలియజేశారు.
శ్రీవారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విగ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3 వేల మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర
తిరుపతి, 2017 అక్టోబరు 28: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.
కాగా, సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఆలయ ఏఈవో శ్రీప్రసాదమూర్తిరాజు, శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ హరినామసంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3 వేల మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నట్టు తెలిపారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుందన్నారు.
అక్టోబరు 30వ తేదీ సోమవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం ఉడిపి కాణ్యూర్ మఠము శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థ స్వామిజీ, ఇతర అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తామన్నారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటామని తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.