డిసెంబరు 3 నుంచి 10వ తేదీ వరకు నైమిశారణ్యంలో అఖండనామ సంకీర్తన యజ్ఞం

డిసెంబరు 3 నుంచి 10వ తేదీ వరకు నైమిశారణ్యంలో అఖండనామ సంకీర్తన యజ్ఞం

నవంబరు 29, తిరుపతి, 2017: టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యంలో డిసెంబరు 3 నుంచి 10వ తేదీ వరకు అఖండనామ సంకీర్తన యజ్ఞం, శ్రీమద్‌ భాగవత సప్తాహం, దివ్యశాంతి యాగం జరుగనున్నాయి.

నైమిశారణ్యంలో 5 వేల సంవత్సరాల పూర్వం 10 వేల మంది ఋషులు ఏకకాలంలో తపస్సు చేసి ఈ ప్రాంతానికి పవిత్రతను తీసుకొచ్చారు. వ్యాస భగవానులవారు అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని మొదటిసారి 10 వేల మంది శిష్యులకు ఈ ప్రాంతంలోనే ప్రవచనం చేశారు. పవిత్రమైన గోమతి నదీ, చక్రతీర్థమనే పుణ్య సరోవరం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ భక్తుల కోరికలు నెరవేర్చే లలితామాత కొలువైయున్నారు.

ఈ నేపథ్యంలో ప్రతి ఏడాదీ విశ్వశాంతి కోసం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి 80 బృందాల్లో 2500 మంది భజనమండళ్ల సభ్యులు పాల్గొంటారని వివరించారు. పురందరదాసుల సంకీర్తనల భజనలు, దివ్యశాంతియాగం, మహాగణపతి యాగం, శ్రీపవమాన యాగం, రుద్రస్వాహాకార యాగం, శ్రీనరసింహయాగం, శ్రీ ధన్వంతరీ యాగం, శ్రీవిష్ణుమహాయాగాలు నిర్వహిస్తామన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.