SALE OF 2019 CALENDARS AND DIARIES IN ONLINE FROM SEPTEMBER 14 ONWARDS-EO_ ఆన్‌లైన్‌లో  61,540 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల : ‘డయల్‌ యువర్‌ ఈవో’లో  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 07 September 2018: The TTD calendars and diaries 2019 will be made available in online for sales from September 14 onwards soon after they are released by Honourable CM of AP on September 13 on the first day of annual brahmotsavams, said TTD EO Sri Anil Kumar Singhal.

During the monthly Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO informed the pilgrims via the platform about online sales of TTD Diaries and Calendars.

Pilgrim caller Sri Pandian from Dindivanam of Tamilnadu sought EO to keep some coin box phone facility available at Rambhageecha, so that they can contact the cab driver or kin after coming out of darshan for which the EO assured the suggestion will be implemented soon.

Callers Sri Srinu Kumar from Viziayanagaram, Sri Nagesh from Anantapur suggested EO to instruct the employees to wear the ID card in a visible manner.

Sri Prabhakar from Chennai sought EO to ensure that door mats be laid at Rs.300 queue line compartments.

Another caller Sri Madhav from Kurnool brought to the notice of EO that the srinivasa kalyanam which was performed by TTD in Betamcherla of Kurnool district took place adjacent to a church and sought EO to select appropriate places while performing such religious events. EO said necessary care will be taken.

Sri Tukaram from Tirupati sought EO to reduce advertisements in SVBC channel for which he said necessary action has already been initiated.

Sri Nitin from Venkatagiri said there is need for proper surveillance near show keeping counters at Annaprasadam while Sri Sreedhar from Nuziveedu sought EO to avoid wastage in Annaprasadam counters inside temple.

Another caller Sri Jagan Mohan from Guntur brought to the notice of EO about the illegal happenings in TTD rest houses in Tirupati. EO responded that the vigilance sleuths will look into the issue immediately.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar and other senior officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆన్‌లైన్‌లో  61,540 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల : ‘డయల్‌ యువర్‌ ఈవో’లో  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబరు 07,  తిరుమల 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన డిసెంబరు నెల కోటాలో మొత్తం 61,540 టికెట్లను  శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 6,115 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 3,595, తోమాల 50, అర్చన 50, అష్టదళపాదపద్మారాధన 120, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 55,425 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4,050, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,150, వసంతోత్సవం 14,300, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.

1. రావు – బెంగళూరు, వేంకటేశ్వరరెడ్డి – ఒంగోలు.

ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ఆలయం సమీపంలో గదులు కేటాయించండి, ఒక్కోసారి వృద్ధులు, దివ్యాంగుల లైన్‌ను ఆపేస్తున్నారు? 

ఈవో : వృద్ధులు, దివ్యాంగుల లైన్‌ను ఆపి జనరల్‌ లైన్‌ను పంపే అవకాశం లేదు. వీరి కోసం నూతనంగా షెడ్డు ఏర్పాటుచేస్తున్నాం. ఉదయం 7 గంటల నుండి రోజుకు 1400 టోకెన్లు జారీ చేస్తున్నాం. వృద్ధులు ముందుగా వచ్చి టోకెన్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

2. నగేష్‌ – అనంతపురం, శీనుకుమార్‌ – విజయనగరం.

ప్రశ్న: శ్రీవారి ఆలయం నుండి చెప్పులస్టాండ్‌ వరకు కార్పెట్‌ పరచండి? ఆలయంలో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు, గుర్తింపుకార్డు ధరించేలా చూడండి. కాంట్రాక్టు సిబ్బంది బాగా పనిచేస్తున్నాంరు. పరకామణి సేవలో అందరికీ అవకాశం కల్పించండి?

ఈవో : కార్పెట్‌ ఏర్పాటుచేస్తాం. ఆలయంలో సిబ్బంది గుర్తింపుకార్డులు ధరించేలా చూస్తాం. భక్తులతో నడుచుకునే విధానంపై సిబ్బందికి శిక్షణ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు మాత్రమే పరకామణి సేవ చేసే అవకాశముంది.

3. పాండియన్‌ – దిండివనం.

ప్రశ్న: శ్రీవారి దర్శనానంతరం బయటకు రాగానే కార్‌ పార్కింగ్‌ వద్ద ఫోన్‌ వసతి కల్పించండి?

ఈవో : ప్రస్తుతం రాంభగీచా విశ్రాంతి గృహం వద్ద కాయిన్‌ బాక్సు ఫోన్‌ సౌకర్యం ఉంది. మరిన్ని పెంచుతాం.

4. చంద్రశేఖర్‌ – హైదరాబాద్‌.

ప్రశ్న: కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని భక్తుల కోసం కొన్ని ఆర్జితసేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో కేటాయించండి?

ఈవో : ఎక్కువమంది భక్తుల సౌకర్యం కోసమే ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను అందుబాటులో ఉంచుతున్నాం.

5. పాపాజి – దిండిగల్‌, గాయత్రి – చెన్నై .

ప్రశ్న :  శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. కొంత సమయం అయినా స్వామివారిని చూడనివ్వడం లేదు? రద్దీ లేకపోయినా శ్రీవారి సేవకులు తోసేస్తున్నారు.

ఈవో : భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీవారి ఆలయంలో భక్తులు స్వీయనియంత్రణ పాటిస్తే తోపులాట లేకుండా సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. శ్రీవారి సేవకులకు తగిన సూచనలిస్తాం.

6. నందగోపాల్‌ – చెన్నై 

ప్రశ్న :  నాకు 75 సంవత్సరాలు. టిటిడి భక్తులకు కల్పిస్తున్న వసతులు చాలా బాగున్నాయి?

ఈవో : ఉద్యోగుల సమష్టి కృషితోనే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం, బస, అన్నప్రసాదాలు తదితర వసతులు కల్పిస్తున్నాం.

7. శ్రీధర్‌ – నూజివీడు

ప్రశ్న :  శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు వృథా అవుతున్నాయి. బయటకు తరలించండి. వగపడిని  పరిశుభ్రంగా ఉంచండి?

ఈవో : భక్తుల సహకారంతోనే అన్నప్రసాదాల వృథాను అరికట్టగలం. వగపడిలో శుచి, శుభ్రత ఉండేలా చూస్తాం.

8. షణ్ముఖ సుందరం – షోళింగర్‌.

ప్రశ్న :  నడకదారిలో టికెట్లు అయిపోతున్నాయి?

ఈవో : కాలినడక భక్తుల కోసం అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 6 వేల టికెట్లు కేటాయిస్తున్నాం. సెలవుదినాలు, ఇతర పర్వదినాల రోజుల్లో త్వరగా అయిపోతాయి. అలాంటి సమయాల్లో భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొంది స్వామివారిని దర్శించుకోవచ్చు.

9. నితిన్‌ – వెంకటగిరి.

ప్రశ్న :  అన్నప్రసాద భవనం వద్ద చెప్పులు పోయాయి. ఇక్కడి స్టాండ్‌లో టోకెన్ల పద్ధతి పెట్టండి?

ఈవో : తగిన చర్యలు తీసుకుంటాం.

10. జగన్మోహన్‌ – గుంటూరు.

ప్రశ్న :  తిరుమలలోని హోటళ్లలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతిలోని టిటిడి విశ్రాంతిగృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి?

ఈవో : తిరుమలలోని హోటళ్లలో టిటిడి నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. ధరల పట్టికను ప్రదర్శించాలి. భక్తుల కోసం అదనంగా ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటుచేసి అన్నప్రసాదాలు అందిస్తున్నాం. తిరుపతిలోని టిటిడి విశ్రాంతిగృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా భద్రతా సిబ్బందికి తగిన సూచనలిస్తాం.

11. మాధవ్‌ – కర్నూలు.

ప్రశ్న :  బేతంచర్లలో చర్చి పక్కనే శ్రీవారి కల్యాణం నిర్వహించారు, పరిశీలించండి?

ఈవో : ఇకపై అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.

12. ప్రభాకర్‌ – చెన్నై .

ప్రశ్న :  రూ.300/- క్యూలైన్‌ మార్గంలో కంపార్ట్‌మెంట్లలోని మరుగుదొడ్ల వద్ద డోర్‌మ్యాట్లు తదితర  పరిశుభ్రతా చర్యలు చేపట్టండి?

ఈవో : తప్పకుండా చేపడతాం.

13. ప్రతాప్‌ – చిత్తూరు.

ప్రశ్న :  గరుడ సేవ సమయంలో మార్పు చేశారా?

ఈవో : ఈసారి అరగంట ముందుగానే మొదలుపెడతాం. రాత్రి 7 నుండి 12 గంటల వరకు నిర్వహిస్తాం.

14. తుకారాం – తిరుపతి.

ప్రశ్న :  ఎస్వీబీసీలో యాడ్స్‌ తగ్గించండి?

ఈవో : గత సంవత్సర కాలంలో యాడ్స్‌ తగ్గించాం. ఇంకా పూర్తిగా తగ్గిస్తాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రగించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…

– అమరావతిలో సిఆర్‌డిఏ కేటాయించిన 25 ఎకరాల స్థలంలో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయం  నిర్మాణ పనులను నవంబరులో ప్రారంభిస్తాం.

– 2019 టిటిడి డైరీలు, క్యాలెండర్లను సెప్టెంబరు 13న గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరిస్తారు. సెప్టెంబరు 14 నుండి భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తాం.

– ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో ఆర్జితసేవలు పొందే భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అవకతవకలను గుర్తించేందుకు పటిష్టమైన విధానాలను అమలుచేస్తున్నాం.

– టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భక్తులు అందించిన విరాళాలు సెప్టెంబరు 6వ తేదీ నాటికి రూ.వెయ్యి కోట్లకు చేరాయని తెలియజేస్తున్నాం.

– 1952వ సంవత్సరం నుండి తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదు చేసిన ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి. అప్పటి నుండి రెండు సార్లు ప్రభుత్వం నియమించిన కమిటీలు విచారణ జరిపి అన్నీ సక్రమంగా ఉన్నాయని తేల్చాయని స్పష్టం చేస్తున్నాం.

– తిరుమలలోని విశ్రాంతిగృహాల్లో గదులకు అవసరమైన మరమ్మతులు, ఇతర అభివృద్ధిపనులను  త్వరలో మొదలుపెడతాం.

– సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మూెత్సవాలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. భక్తులు శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను సంతృప్తికరంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టాం. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు,  బస, లడ్డూ ప్రసాదం తదితర వసతులు కల్పిస్తాం.

– ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.

– శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం.

– ఈ బ్రహ్మూెత్సవాల్లో ఉదయం వాహనసేవ ఉదయం 9 నుండి 11 గంటల వరకు యథాతథంగా జరుగుతుంది. అయితే, రాత్రి వాహనసేవను ఒక గంట ముందుగా అంటే రాత్రి 8 నుండి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకే  ప్రారంభమవుతుంది.

– శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, నూతన సంవత్సరం, ఇతర రద్దీ రోజులలో విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాం. ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ మాడ వీధులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకొస్తాం.

– రూ.98 కోట్ల వ్యయంతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా నిర్మించిన శ్రీవారి సేవా సదన్‌  నూతన భవనాలను బ్రహ్మూెత్సవాల్లో ప్రారంభిస్తాం.

– తిరుమలలో భక్తులకు వసతిని పెంచడంలో భాగంగా రూ.79 కోట్లతో తిరుమలలోని గోవర్ధన సత్రం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మిస్తాం.

దర్శనం : 

–  గతేడాది ఆగస్టులో 22.69 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఆగస్టులో 19.28 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 

హుండీ ఆదాయం : 

–  శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఆగస్టులో రూ.93.05 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టులో రూ.82.85 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం : 

–  గతేడాది ఆగస్టులో 52.45 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఆగస్టులో 43.32 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది. 

లడ్డూ లు : 

–  గతేడాది ఆగస్టులో 85.53 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఆగస్టులో 82.83 లక్షల లడ్డూలను అందించాం.

తలనీలాలు : 

–  గతేడాది ఆగస్టులో 11.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది ఆగస్టులో 7.93 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.