ELABORATE ARRANGEMENTS BY TTD_ భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు

Tiruchanur, 23 November 2017: TTD has made elaborate security and annaprasadam arrangements for the celestial fete.

Apart from TTD security, the police personnel deployed at different entry and exit points at pushkarini for devout management and see that no untowards incident takes place during Panchami Theertha Snanam.

On the other hand about 1.5lakh anna prasadam packets and 2 lakh water packets were distributed by Annaprasadam and health wings rwspectively.

Over 250 scouts and 250 srivari sevakulu also rendered impeccable services during the annual fete.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

ముగిసిన శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాలు

పంచమితీర్థంనాడు విశేష సంఖ్యలో భక్తుల పవిత్రస్నానం

భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు

లక్ష మందికి అల్పాహారం, అన్నప్రసాదాలు

పోలీసులు, టిటిడి విజిలెన్స్‌, శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ విశేష సేవలు

తిరుపతి, 2017 నవంబరు 23: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మూత్సవాలు గురువారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆలయం వద్ద గల పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి పవిత్రస్నానాలు ఆచరించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన అశేష భక్తజనవాహినికి ఎలాంటి రాజీకి తావులేకుండా టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

లక్ష మందికి అల్పాహారం, అన్నప్రసాదాలు :

టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు లక్ష మంది భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు అందించారు. ఉదయం పుష్కరిణిలో వేచి ఉన్న భక్తులకు 20 వేల ప్యాకెట్ల సేమియా ఉప్మా పంపిణీ చేశారు. అదేవిధంగా బయట క్యూలైన్లలో వేచి ఉన్న 30 వేల భక్తులకు ఉప్మా, పొంగలి అందజేశారు. మధ్యాహ్నం తోళప్పగార్డెన్స్‌, జడ్‌పి హైస్కూల్‌, అయ్యప్పస్వామి గుడి పక్కన, పసుపు మండపం వద్ద 50 వేల మంది భక్తులకు కదంబం, చక్కెర పొంగళి, దధ్యోధనం అందజేశారు.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు :

పంచమితీర్థానికి విచ్చేసిన భక్తులకు టిటిడి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు 11 గేట్లు, తిరిగి వెళ్లేందుకు 17 గేట్లను ఏర్పాటుచేశారు. పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లను తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి, టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఏఎస్పీ శ్రీ ఎంవిఎస్‌.స్వామి, డిఎస్పీ శ్రీ మునిరామయ్య ఆధ్వర్యంలో విజిలెన్స్‌ అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు, ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు. కాలినడకన వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుచానూరు బయటి నుంచే వాహనాలను దారి మళ్లించారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలకు, పాడిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టారు. 300 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 1500 మంది పోలీసులు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించారు.

దాదాపు 2 లక్షల తాగునీటి ప్యాకెట్ల పంపిణీ :

పంచమితీర్థం సందర్భంగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం అదనంగా ఏడు మొబైల్‌ మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 150 మంది, గజవాహనం నాడు 250 మంది పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు.

శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ విశేషసేవలు :

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విశేష సేవలు అందించారు. ఆలయంలోని క్యూలైన్లు, వాహనసేవల్లో, అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలందించారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు దాదాపు 300 మంది, పంచమితీర్థం రోజున దాదాపు 500 మంది శ్రీవారిసేవకులు, 100 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలు అందించారు.

భక్తులకు విశేషంగా వైద్యసేవలు :

బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు విశేషంగా వైద్యసేవలు అందించారు. రోజుకు సరాసరి వెయ్యి మందికి వైద్యం అందించి మందులు అందజేశారు. అమ్మవారి వాహనం మోసే వాహనబేరర్లకు వైద్యపరంగా తగిన చర్యలు చేపట్టి ఉపశమనం కల్పించారు. టిటిడి వైద్యులతోపాటు స్విమ్స్‌, రుయా ఆస్పత్రుల నుంచి మొత్తం 60 మంది వైద్యసిబ్బంది సేవలందించారు. పంచమితీర్థం రోజు 4 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన :

హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల్లో కోలాటాలు, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన జానపద కళాబృందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుచానూరులోని ఆస్థానమండపం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, శిల్పారామం వేదికలపై ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్వీ గోశాల ఆధ్వర్యంలో వాహనసేవల ఎదుట గజాలు, అశ్వాలు, వృషభాల ఊరేగింపు వేడుకగా సాగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.