ALL SET FOR ANNUAL BRAHMOTSAVAMS-TTD EO_ శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

TIRUMALA, 11 September 2018: The hill town of Tirumala has geared up for the nine day annual brahmotsavams which will commence on September 13, said TTD EO Sri Anil Kumar Singhal.

During the press conference held at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the EO told media persons that Honourable CM of AP Sri N Chandra Babu Naidu will present the silk vastrams on the first day of brahmotsavams on September 13.

The other important days includes Garuda Seva on September 17, Swarna Ratham on September 18, Rathotsavam on September 20 and Chakra Snanam on September 21. This year the evening vahana sevas will commence by 8pm while Garuda Seva by 7pm, EO added.

Elaborating on Security arrangements, the EO said about 3000 police will vigil the mega event apart from TTD vigilance. While on Garuda Seva an additional 1000 personnel will take care of the security aspects. Besides 3000 srivari sevaku lu, 1000 scouts and guides will also render services to pilgrims while the NDRF team and specialised swimmers will work under the instructions of CVSO, he said.

The EO said, 31 LED screens, 11 first aid centres, 12 ambulances, 800 additional sanitation staffs have been deployed for the annual fete. Parking place to accommodate 7000 vehicles is also been created. Parking has also been created near Alipiri. The Ghat roads remains open for 24 hours during these days. Cultural teams from Manipur, Gujrat, UP also will take part this year apart from southern states.

All the engineering works, annaprasadam, health, accommodation allotments were completed. No donor privileges will be entertained during annual fete. The vahana sevas will be live telecast on SVBC for the sake of global pilgrims. All our officers, police and district administration are working in coordination towards the success of this mega religious event, EO asserted.

Later Tirumala JEO Sri KS Sreenivasa Raju said that there will be no Special entry darshan or sarva darshanam tokens will be issued on Garuda seva day. The Divya Darshanam tokens will not be issued on September 16 and 17.
Two wheelers will not be allowed to ply on ghat raods on Garuda Seva day in view of safety of pilgrims in the wake of anticipated heavy pilgrim rush.

Tirupati JEO Sri P Bhaskar, CVSO In-charge Sri Siva kumar Reddy, CE Sri Chandrasekhar Reddy and other senior officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబరు 11, తిరుమల 2018: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు(సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు), నవరాత్రి బ్రహ్మోత్సవాల(అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు)కు సర్వం సిద్ధమైందని, విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 13న ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఆగమపండితుల సలహా మేరకు ఈ బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహనసేవను ఒక గంట ముందుగా ప్రారంభించి రాత్రి 8 నుండి 10 గంటల వరకు, గరుడవాహనసేవను అరగంట ముందుగా రాత్రి 7 గంటలకు ప్రారంభించి రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాతలు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. భక్తుల కోసం రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుతామన్నారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్‌, పుష్పాలంకరణలు చేపట్టామని చెప్పారు. బ్రహ్మూెత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు జిల్లా యంత్రాంగం తమ వంతు సహకారం అందిస్తోందన్నారు.

దాదాపు రూ.9 కోట్లతో విద్యుత్‌ అలంకరణలు, పెయింటింగ్‌, బారికేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులు చేపట్టామని ఈవో తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని, ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ మాడ వీధులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వాహనసేవలను తిలకించేందుకు మాడ వీధుల్లో 19, భక్తుల రద్దీ ఉన్న ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 31 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తిరుమల, నడకమార్గాల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తామన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం, విద్యాసంస్థలు, కల్యాణమండపాలు, బస్టాండు, రైల్వేస్టేషన్‌, అన్ని ముఖ్య కూడళ్లలో స్వాగత ఆర్చిలు, విద్యుద్దీపాల కటౌట్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గరుడసేవ నాడు గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు.

తిరుమలలో 7 వేల వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఈవో తెలిపారు. గరుడసేవ నాడు ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాలను నిషేధించామని, ఇందుకోసం తిరుపతిలో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటుచేశామన్నారు. ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు 8 ప్రాంతాల్లో క్రేన్లు, ఆటోమొబైల్‌ క్లినిక్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిఘా, భద్రతా విభాగం, పోలీసులతో సంయుక్తంగా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పోలీసులకు బాడివోర్న్‌ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ అందించినట్టు చెప్పారు. 3 వేల మంది పోలీసులు, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని వివరించారు.

బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని, వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ సందర్భంగా సెప్టెంబరు 15 నుండి 17వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ సందర్భంగా అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని ఈవో తెలిపారు. ఆలయ నాలుగు మాడవీధులు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనంగా 800 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. 11 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేశామని, 12 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. రెండు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు స్థానిక కళాకారులతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, హర్యానా, మణిపూర్‌, పాండిచ్చేరి రాష్ట్రాల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో ఆస్థానమండపం, నాదనీరాజనం వేదికతోపాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, శిల్పారామంలో ఆధ్యాత్మిక, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ గరుడసేవ సందర్భంగా సెప్టెంబరు 16, 17వ తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు. అదేవిధంగా సెప్టెంబరు 17న సర్వదర్శనం టోకెన్లు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను రద్దు చేసినట్టు తెలిపారు.

మీడియా సమావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.