EO INSPECTS LADDU COUNTERS _ తిరుమలలో లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసిన తితిదే ఈవో
తిరుమలలో లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసిన తితిదే ఈవో
తిరుమల, 03 అక్టోబరు 2013: తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ గురువారం ఉదయం తిరుమలలోని లడ్డూ కౌంటర్లను తనిఖీ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి కాలిబాట మార్గంలో తిరుమలకు విచ్చేసే భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన అక్టోబరు 5వ తేదీ నుండి ఒక్కరికి ఉచితంగా ఒక్క లడ్డూ ప్రసాదం అందజేయాలని తితిదే ధర్మకర్తల మండలి తీర్మానించింది.
అందులో భాగంగా తితిదే ఈవో, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డితో కలిసి తిరుమలలోని లడ్డూ కౌంటర్లను సందర్శించారు. వైకుంఠం క్యూకాంప్లెక్సు-2లో భక్తులు వేచి ఉండే కంపార్ట్‌మెంట్లను, వాటిలో కాలిబాట భక్తులకు అందించే లడ్డూ టోకెన్ కేంద్రాలను, ఆలయం వెలుపల లడ్డూ ప్రసాదాలు అందించే కేంద్రాలను తనిఖీ చేశారు.
కాలిబాట భక్తులకు గాలిగోపురం వద్ద అందించే దివ్యదర్శనం టోకెన్లపై అదనంగా ఉచిత లడ్డూ అందించాలని నిర్ణయించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెనుకవైపు గల లడ్డూ ప్రసాద కౌంటర్లలో దివ్యదర్శనం టోకెన్ చూపి ఈ ఉచిత లడ్డూను పొందవచ్చని ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.