FIVE DAY SRI VARI ANNUAL FLOAT FESTIVAL BEGINS _ తెప్పపై ఆవిష్కృతమైన స్వామివారి శ్రీరామావతార వైభవం
తెప్పపై ఆవిష్కృతమైన స్వామివారి శ్రీరామావతార వైభవం
తిరుమల, 23 మార్చి – 2013 : సర్వజగద్రక్షకుడైన స్వామివారు స్వామి పుష్కరిణిలో తన అనేక అవతార వైభవంతో ఐదు రోజులపాటు సంధ్యాసమయమున తెప్పపై ఆనంద విహారం చేయడమే తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం పాల్గుణమాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులపాటు తెప్పోత్సవాలను తి.తి.దే ఘనంగా నిర్వహిస్తుంది.
ఈ తెప్పోత్సవం కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలైన వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తి.తి.దే రద్దు చేసింది
తొలిరోజు సాయంత్రం స్వామివారు శ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామి పుష్కరిణిలో తెప్పపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణంగా విహరించారు. స్వామివారి శోభాయమాన రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయత్త్వంతో పులకించారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.