HANUMANTHA VAHANAM _ హనుమద్వాహనంపై శ్రీరాముడి తేజసం

On the 6th day of ongoing Annual Brahmotsavam in Sri Kondanda Rama Swamy Temple, Lord Rama is taken out in procession on HANUMANTHA VAHANAM around four mada streets on Saturday.
 
TTD Executive Officer Sri L.V.Subramanyam, Joint Executive Officer Sri P.Venkatarami Reddy, DyEO(Local Temples) Sri Chandrasekhar Pillai, DPP Spl Officer Sri Raghunath, Supdt Engineer Sri Sudhakar Rao, Executive Engineer, Sri Jagadeeswara Reddy, Garden Supdt Sri Srinivas, Temple Supdt Sri Munisuresh Reddy, Temple Inspector Sri Anjaneyulu, Temple Staff and devotees took part.
 

హనుమద్వాహనంపై శ్రీరాముడి తేజసం

తిరుపతి, మార్చి 16, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చి హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
వాహన సేవ అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు గజ వాహనసేవ జరగనుంది.
హైందవ సనాతన ధర్మంలో గజం వాహనంగా విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజధర్బాలలో కానీ, ఉత్సవములలో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయంలో శనివారం ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీమతి డి.మనోహరమ్మ బృందం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శ్రీ కోమండూరి శేషాద్రి ”శ్రీ త్యాగరాజ శ్రీరామ దర్శనం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ”రామచంద్ర విజయం” నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం దంపతులు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.