SUBHAPRADHAM CLASSES FROM MAY 12 TO 18 _ కేంద్ర హోంమంత్రి శ్రీ షిండే చేతులమీదుగా ”శుభప్రదం” పోస్టర్ల ఆవిష్కరణ
కేంద్ర హోంమంత్రి శ్రీ షిండే చేతులమీదుగా ”శుభప్రదం” పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి, మార్చి 16, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుభప్రదం పేరిట మే 12 నుండి 18వ తేదీ వరకు తలపెట్టిన రెండో విడత వేసవి శిక్షణ తరగతుల పోస్టర్లను కేంద్ర హోంమంత్రివర్యులు గౌ|| శ్రీ సుశీల్‌కుమార్ షిండే శనివారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ సుశీల్‌కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తితిదే విశేష కృషి చేస్తోందన్నారు. శుభప్రదం కార్యక్రమాన్ని విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
కాగా, భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ, నైతిక విలువలు, ఆర్ష ధర్మాలు, యోగ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో భావిభారత పౌరులైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు తితిదే శుభప్రదం కార్యక్రమాన్ని రూపొందించింది. చక్కటి ఆలోచనలు, ప్రవర్తన, నడవడికను తీర్చిదిద్దడం, ఇతరులకు మేలు చేసేలా మార్గదర్శనం చేయడం, విద్యార్థుల్లోని ఉత్సాహాన్ని, కళల పట్ల, ఆటల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి దిశానిర్దేశం చేయడం ఈ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశం.
15 నుండి 17 సంవత్సరాల మధ్య గల పదో తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనవచ్చు. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ తరగతుల్లో విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
గతేడాది తిరుపతి, అనంతపురం, వరంగల్లు, హైదరాబాదు, గుంటూరు, విశాఖపట్టణం కేంద్రాల్లో మే 15 నుండి 26వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మూడు వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 23 కేంద్రాల్లోనూ ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో కలిపి పది వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొంటారని అంచనా. బాలికల కోసం ప్రత్యేకంగా తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్టణంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారు విద్యార్థుల మానసిక వికాసానికి అవసరమైన అన్ని విషయాలను బోధించనున్నారు.
ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనదలచిన వారికి అన్ని జిల్లా కేంద్రాల్లోని తితిదే కల్యాణ మండపాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 31వ తేదీలోపు సంబంధిత కల్యాణ మండపాల్లో సమర్పించాల్సి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.