TTD NETS ₹7.62CRORES TOWARDS THE E-AUCTION OF 17, 200KILOS OF DIFFERENT VARIETIES OF HUMAN HAIR_ తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 7.62 కోట్లు

TTD nets ₹7.62crores towards the e-auction of 17, 200kilos of different varieties of a human hair held on Thursday.

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 7.62 కోట్లు

తిరుమల, 2019 సెప్టెంబ‌ర్ 05: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలం గురువారం నిర్వ‌హించారు. త‌ద్వారా టిటిడి రూ. 7.62 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 17,200 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 5,800 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ. 18,334/-గా ఉన్న బి క్యాట‌గిరి – 2000 కిలోలను వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.18.33 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

రెండో రకం తలనీలాలో కిలో రూ.17,814/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 6,800 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.71.26 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ. 8,609/- గా ఉన్న బి క్యాట‌గిరి – 5,400 కిలోలు వేలానికి ఉంచగా, అన్నీ అమ్ముడు పోయాయి. తద్వారా రూ.465.30 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

మూడో రకం తలనీలాలో కిలో రూ.6,049/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 1,800 కిలోలను వేలానికి ఉంచ‌గా, 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.30.25 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,554/-గా ఉన్న బి క్యాట‌గిరి – 33,800 కిలోలు వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.1,802/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 9,800 కిలోలను వేలానికి ఉంచ‌గా, అన్నీ అమ్ముడు పోయాయి. తద్వారా రూ.176.60 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

కిలో రూ.59/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 27,000 కిలోలను వేలానికి ఉంచ‌గా, 1,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.0.59 లక్షల ఆదాయం లభించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.