“JAGADANANDA KARAKA” TAKES THE FORM OF “JAGANMOHINI” TO CHARM DEVOTEES_ మోహినీ అలంకారంలో జగన్మోహనుడు
Vontimitta, 29 March 2018: On fifth day morning as a part of ongoing annual brahmotsavams at Vontimitta, Lord Sri Rama enchanted the devotees in the avatar of universal damsel-Mohini.
Draped in colourful clothes, jewels and flowers, the Lord as Jaganmohini impressed the devotees with His beauty and blessed the devotees.
AEO Sri Ramaraju, Superintendent Sri Subramanyam, Sri Nagaraju were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మోహినీ అలంకారంలో జగన్మోహనుడు
మార్చి 29, ఒంటిమిట్ట, 2018: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం మోహినీ అలంకారంలో రాములవారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నాడు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
గరుడసేవ :
శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ రామరాజు, సూపరింటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భక్తిభావాన్ని పంచిన ధార్మిక కార్యక్రమాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి.
ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీ పసుపులేటి శంకరయ్య ”రామాయణం -జాతికి సందేశం” అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో శ్రీమతి సుస్మిత బృందం ఊంజల్‌సేవలో భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ ఎస్.నాగరాజు భాగవతార్ హరికథ వినిపిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.