ఆలయాల నిర్మాణం ద్వారా క్షేత్రస్థాయిలో ధర్మప్రచారం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఆలయాల నిర్మాణం ద్వారా క్షేత్రస్థాయిలో ధర్మప్రచారం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

నవంబరు 30, తిరుపతి, 2017: రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆలయాల నిర్మాణం ద్వారా ధర్మప్రచార కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు వీలవుతుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గల హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యాలయంలో గురువారం రాత్రి సమరసతా సేవా ఫౌండేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లో రూ.25 కోట్ల వ్యయంతో 500 ఆలయాల నిర్మాణానికి టిటిడి సహకారం అందిస్తోందన్నారు. ఇప్పటికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఒక్కో గుడికి రూ.5 లక్షల చొప్పున కేటాయించామన్నారు. ఇప్పటివరకు 82 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, మరో 70 ఆలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నిర్ణీత వ్యవధిలోపు మిగిలిన ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో సమరసతా సేవా ఫౌండేషన్‌ అధ్యక్షులు శ్రీ ఎంజికె.మూర్తి, టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, డెప్యూటీ ఈవో(జనరల్‌) శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.