JEO INSPECTS BRAHMOTSAVAM ARRANGEMENTS _ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను తణిఖీ చేసిన తిరుమల జె.ఇ.ఓ
బ్రహ్మోత్సవ ఏర్పాట్లను తణిఖీ చేసిన తిరుమల జె.ఇ.ఓ
తిరుమల, 15 సెప్టెంబరు 2013 : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 5 వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు జరుగనున్న నేపథ్యంలో తిరుమలలో విస్తృతంగా జరుగుతున్న వివిధ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, సి.వి.ఎస్. శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్ మరియు తిరుపతి అర్బన్ ఎస్.పి. శ్రీ రాజశేఖర్ బాబులతో కూడి నాలుగు మాడ వీధులలో పర్యటించారు.
అనంతరం తనను కలసిన మీడియాతో జె.ఇ.ఓ మాట్లాడుతూ జరుగుతున్న ఏర్పాట్లను గూర్చి వివరించారు. ముఖ్యంగా నవాహ్నికంగా సాగే బ్రహ్మోత్సవాల సమయంలో అతి ముఖ్యమైన ఐదవ నాడు గరుడ సేవను పురస్కరించుకొని తిరుమలకు విచ్చేసే భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమాడ వీధుల్లోని గ్యాలరీలను విస్తరించడం జరిగిందన్నారు. అదే విధంగా గ్యాలరీలను ఏ విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అమర్చాలో, వాహన సేవ అయిన తరువాత ఏ విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటలను జరుగకుండా సురక్షితంగా బయటకు పంపాలో ఆ మార్గాలను తణిఖీ చేశామన్నారు.
ఇక నూతన స్వర్ణరథం ఇప్పటికే పూర్తి కావచ్చిందని, దానికి సంబంధించిన వివిధ విడి భాగాల కూర్పు సోమవారంనాడు జరుగుతుందన్నారు. ఈ నెల 25 లేక 30వ తారీఖున నూతన స్వర్ణరథాన్ని తిరుమాడ వీధుల్లో ప్రయోగత్మకంగా ఊరేగిస్తామన్నారు. అయితే ఈ స్వర్ణరథానికి శాస్రోక్తంగా పూజలను మాత్రం అక్టోబరు 10వ తారీఖున జరిగే స్వర్ణరథం ఊరేగింపుకు రెండు గంటల మునుపు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏడాదికి ఒకసారి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన అధికారుల తణిఖీలో ఎస్.ఇ.2 శ్రీరమేశ్ రెడ్డి, అదనపు సి.వి.ఎస్.ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటి ఇ.ఓ. శ్రీ చిన్నంగారి రమణ, అదనపు ఎస్.పి. శ్రీ ఉమామహేశ్వరశర్మ, తిరుమల డి.ఎస్.పి. శ్రీ నంజుండప్ప, ఇతర తి.తి.దే అధికారులు మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.