JEO TAKES PART IN THE THANKSGIVING VANABHOJANAM AT PAPAVINASANAM _ తెప్పోత్సవ కార్మికులకు పాపవినాశనంలో తిరుమల జె.ఇ.ఓ కృతజ్ఞతా పూర్వక విందు
తెప్పోత్సవ కార్మికులకు పాపవినాశనంలో తిరుమల జె.ఇ.ఓ కృతజ్ఞతా పూర్వక విందు
తిరుమల, 29 మార్చి – 2013 : ఈ నెల 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు 5 రోజుల పాటు తిరుమలలో వార్షిక తెప్పోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం వెనుక విధులను చక్కగా నిర్వర్థించిన వివిధ విభాగాల అధికారులు, కార్మికులకు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు పాత పాపవినాశనం పుణ్యతీర్థ ఘట్టమందు కృతజ్ఞతా పూర్వక విందును ఏర్పాటు చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం తిరుమల జె.ఇ.ఓ దాదాపు 100 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది వెంటరాగా ఇప్పుడున్న పాపవినాశనం మార్గం నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత పాపవినాశనం జలాశయం చెంత కాలినడకన చెరుకున్నారు. అక్కడ వెలసివున్న ఆంజనేయస్వామి, గంగాదేవి దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం జె.ఇ.ఓ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, తెప్పోత్సవాలను ఎంతో మెళకువగా, అత్యంత నేర్పుతో సమర్థవంతంగా నిర్వర్తించిన ఇంజనీరింగ్, నీటిశాఖ, ఉద్యానవనశాఖ మరియు ఆరోగ్యశాఖ సిబ్బంది పనితీరును ప్రశంసించారు.
తెప్పను శోభాయమానంగా విద్యుద్దీపకాంతులతో, వివిధ పుష్పాలంకరణలతో తీర్చిదిద్దిన తీరు చాల అద్భుతంగా ఉందని ప్రశంసించారు. భక్తులు సైతం ఎంతో అభినందించారన్నారు. గజ ఈతగాళ్ళు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించారన్నారు. అందరూ చేరి ఒక చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వకుండా ఎంతో క్రమశిక్షణగా తమ విధులను నిర్వర్తించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిఒక్క ఉద్యోగిని అభినందించి అనంతరం వారితో కలసి ప్రకృతి సౌందర్యాల నడుమ వెలసివున్న పాపవినాశ తీర్థంలో వనభోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్, ఎస్.ఇ.2 శ్రీ రమేశ్ రెడ్డి, అదనపు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్ రెడ్డి, ఇ.ఇలు శ్రీ నరసింహమూర్తి, శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ సుబ్రహ్మణ్యం, డివిజనల్ ఇ.ఇ లు శ్రీ రవిశంకర్ రెడ్డి, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, ఉద్యానవనశాఖ ఉపసంచాలకులు శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.