KAISHIKA DWADASI ASTHANA AT SRIVARI TEMPLE ON NOVEMBER 5 _ నవంబరు 5న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం

Tirumala, 05 November 2022: TTD is organising the annual Kaisika Dwadasi Asthanam fete at Srivari temple on November 5.

 

As part of the festivities, the idol of Sri Urga Srinivasa Murthy along with His consorts will be paraded on Mada streets in the early morning between 4.30am and  5.30 am.

 

Legends say that Sri Mahavishnu went into a deep sleep on Uthana Ekadasi and got up on Kaishika Dwadasi which is grandly celebrated at Srivari temple.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 5న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం

తిరుమల, 2022 న‌వంబ‌రు 04: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 5వ తేదీన శ‌నివారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రుగ‌నుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంట‌ల లోపు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుండి ఉదయం 7 గంట‌ల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు.

పురాణాల ప్ర‌కారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొల్ప‌డం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.

కైశికద్వాదశి పౌరాణిక నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీనంబదువాన్‌ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగివచ్చి క్షుద్బాధ‌ను తీరుస్తానని నంబదువాన్‌ ప్రమాణం చేశాడు. అన్నమాట‌ ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారట‌. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే పేరు వ‌చ్చింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.